– అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ పరిధిలో అర్హులైన వారికి నివాస స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ పత్రాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. ఈ నెల 12 లేదా 13న ముఖ్యమంత్రి విజయవాడ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంను సందర్శించారు. సభా వేదిక ఏర్పాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు, ప్రజలు తదితరులకు వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు, సభాస్థలి ప్రాంగణంలో చేయాల్సిన ఏర్పాట్లు తదితరాలపై చర్చించారు. గౌరవ ముఖ్యమంత్రి సభాస్థలికి వచ్చే మార్గం, తిరిగి వెళ్లే మార్గాలను కూడా పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా కృష్ణా కరకట్ట రెండు, మూడో దశల రక్షణ గోడలతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కూడా కలెక్టర్ డిల్లీరావు.. సీపీ కాంతి రాణా టాటా, జేసీ పి.సంపత్ కుమార్ తదితరులతో కలిసి పరిశీలించారు. కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాన్ని సందర్శించి.. రిటైనింగ్ వాల్స్‌తో పాటు విజయవాడ నగర పాలక సంస్థ చేపడుతున్న పార్కు, సుందరీకరణ పనులను పరిశీలించారు. పనుల సత్వర పూర్తికి సూచనలు చేశారు.
Prajavartha Online Telugu News