-విధుల ఒత్తిడి నుంచి ఉపశమనం…
-మహిళా ఉద్యోగుల హక్కుల కోసం ఎన్జిజీవో కట్టుబడి ఉంది…
-ఆందోళన కార్యక్రమాలలో మహిళా ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం
-ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కార్యాలయాలలో, గృహాలలో నిరంతరం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళా ఉద్యోగులలో మానసిక చైతన్యం నింపేందుకు క్రీడలు ఒక దివ్య ఔషధంలా షధంలా ఉపకరిస్తాయని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మహిళా ఉద్యోగుల కోసం రెండు రోజులపాటు నిర్వహిస్తున్న క్రీడల పోటీలు బుధవారం గాంధీ నగర్ లోని ఎన్జీవో హోం లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే పని ఒత్తిడి కారణంగా మహిళలు తీవ్రమైన ఒత్తిడితో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి సందర్భాలలో వారికి తగిన వ్యాయామం చేసుకునే సమయం కూడా ఉండదన్నారు. ఏడాదిలో చాలా సందర్భాలలో సమయానికి ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో మహిళలు ఉద్యోగ బాధ్యతలను ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నో ఆందోళన కార్యక్రమాలలో మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. అటువంటి మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించే క్రీడల పోటీలలో పాల్గొనడం ద్వారా మహిళా ఉద్యోగులు ఒక ఏడాదికి సరిపడే మానసిక చైతన్యాన్ని పొందగలుగుతారన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మహిళా ఉద్యోగులకు ఇది ఒక పండుగ లాంటిదన్నారు. మహిళా ఉద్యోగుల హక్కులు, సంరక్షణ, వారికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాల విషయంలో ఎన్జీవో సంఘం ఎన్నో పోరాటాల ద్వారా కొన్ని హక్కులు సాధించుకోగలిగామన్నారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులకు పురుష ఉద్యోగుల కంటే అదనంగా ఐదు రోజులు సెలవు పెంపు, గతంలో ప్రసూతి సెలవులు ఆరు నెలలు మాత్రమే ఉండగా పిల్లల సంరక్షణ కోసం మరొక ఆరు నెలల సెలవులను అదనంగా ప్రభుత్వం నుంచి పొందగలిగామన్నారు. ఈ ఆరు నెలల సెలవులను మహిళా ఉద్యోగి తన సంతానానికి 18 సంవత్సరాల వయసు వచ్చేలోపు ఎప్పుడైనా వినియోగించుకునేలా అవకాశం ఉందన్నారు. మహిళా ఉద్యోగుల కోసం వారు పనిచేస్తున్న కార్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం, భోజనం కోసం ప్రత్యేకంగా గది కేటాయింపు, ప్రత్యేక విశ్రాంతి మందిర సౌకర్యం, తోటి ఉద్యోగుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణ సంరక్షణలో విధులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు కూడా ఎన్జీవో సంఘం పోరాడి సాధించింద న్నారు. వీటితో పాటుగా మహిళా ఉద్యోగులకు దురదృష్టవశాత్తు గర్భ విచ్చిత్తి జరిగిన సందర్భాలలో 42 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు పొందేలా ఎన్జీవో సంఘం ఆందోళనతోనే సాధ్యమైందన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యల పట్ల ఎన్జీవో సంఘం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వారి ఉద్యోగ బాధ్యతల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అధ్యయనం చేస్తోందన్నారు. తనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పోరాటాల ద్వారా వారి సమస్యలను సత్వరమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. ఏపీ ఎన్జీవో సంఘ మహిళా విభాగం చైర్ పర్సన్ వి. నిర్మలా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఉదారంగా ఆలోచించి ప్రభుత్వం తమ అపరిష్కృత సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. వైద్య విభాగంలో అవుట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది మహిళా ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సభా కార్యక్రమం అనంతరం మహిళా ఉద్యోగులకు మెమరీ గేమ్స్, క్యారమ్స్ (డబుల్స్), చదరంగం, అంత్యక్షరి అంశాలలో నిర్వహించిన పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం జరిగే పోటీల అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో క్యాపిటల్ సిటీ ప్రెసిడెంట్ నాగభూషణం, కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, క్యాపిటల్ సిటీ చైర్ పర్సన్ ఎన్ రత్నమాల, మహిళా విభాగం కన్వీనర్ పి. మాధవి, కోశాధికారి శివలీల, విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి విజయశ్రీ, ఎన్. ఈ. సి. మెంబర్ వి. శాంతిశ్రీ, ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగం కో కన్వీనర్ వివి లలితాంబిక, తదితరులతోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News