-తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచాన అనగా శ్రీకాంత. సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆ జగన్మాత కొలువై వున్న ఊరే ‘తిరుచాన ఊరు’. అదే ‘తిరుచానూరు’గా మారిందని కొందరంటారు. చాల కాలం కిందట ఇది శ్రీ శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం ‘శ్రీశుకుని ఊరు”గా పిలువబడిందనీ, అదే కాలక్రమంగా ‘శ్రీశుకనూరు’ అనీ, ‘తిరుచ్చుకనూరు’ అనీ, ‘తిరుచానూరు’ అని పిలువ బడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీ శుకమహర్షి వంటి మహర్షులెందరో తపస్సులు చేశారనీ, ఆ పక్కనే శుకమహర్షి తాత అయిన పరాశరుని తపోభూమి యోగిమల్లవరం (జోగిమల్లవరం) కూడ వుందనీ, ఇక్కడి పద్మసరోవర తీరాన సాక్షాత్తు వైకుంఠ నాధుడైన శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సాధన చేశాడనీ, తత్ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మసరోవరంలో సహస్రదళాలు కలిగిన పద్మంలో “అలమేలు మంగ” గా, ‘పద్మావతి’గా ఆవిర్భవించిందనీ ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన కథనాలు విన్నప్పుడు పై వాదనలన్నీ పరమ సత్యములన్న రూఢితో పాటు, ఆనందం కూడ కలుగుతుంది.
భృగుమహర్షి పరీక్షవల్ల, శ్రీ వైకుంఠం నుంచి అలిగి భువికి దిగి వచ్చి కొల్హాపుర క్షేత్రం (మహారాష్ట్రం)లో కొలువై వున్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ వేంకటేశ్వర స్వామివారు తపస్సుచేసి ప్రార్థించినాడు. ఆ స్వామివారి కోరిక మేరకు, ఇక్కడి స్వర్ణముఖరీ నదీ తీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతాన పద్మసరోవరంలో “అలమేలు మంగ”గా ఆవిర్భవించింది. అలర్మేల్ మంగ అనగా పద్మంపైన ప్రకాశించే దివ్యవనిత శ్రీకాంత అని అర్థం. అందువల్లే “పద్మావతి” అని మరో పేరు కూడ ఆ తల్లికి సార్థకమయ్యింది.
‘అలమేలుమంగ’గా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వేంకటేశ్వరుడు తన వక్షఃస్థలంపైన “వ్యూహలక్ష్మి”గా నిలుపుకొని వేంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్లాడు. ‘అలమేలు మంగమ్మ” అర్చామూర్తిగా కొలువై ఆరాధింపబడుతున్నందువల్ల తిరుచానూరు శ్రీ క్షేత్రం “అలమేలుమంగపట్నం”గా కూడ ప్రసిద్ధి కెక్కింది. ఇంచుమించుగా ఇదే సమయంలో నారాయణవరం చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతురు పద్మావతిని వెంకటేశ్వరుడు వివాహం చేసుకున్నట్లు ఆ వివాహానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వేంచేసినట్లు కూడా స్పష్టం అవుతున్నది. ఆకాశ రాజ పుత్రిక పద్మావతి ఎవరు అన్న సందేహానికి సమాధానంగా త్రేతా యుగం నాటి రామాయణ గాధను స్మరిస్తే సరిపోతుంది. త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతాలక్ష్మికి బదులుగా లంకలో వేదవతి రావణుని చేరలో ఉండింది రావణ వధ అనంతరం సీతాదేవి తనకు బదులుగా లంకలో అవస్థలు పడిన వేదవతిని వివాహమాడ వలసిందని శ్రీరాముని ప్రార్థించింది.
అప్పుడు శ్రీరాముడు ఏకపత్నివతుడైనందున ప్రస్తుతం అది సాధ్యం కాదని కలియుగంలో ఈ వేదవతి ఆకాశరాజు గారాల పట్టి పద్మావతిగా అయో నిజయై జన్మిస్తుందని అదే సమయంలో తాను శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడగలనని వరమిచ్చినాడు అలాగే ఆచరించినాడు కూడా.
వైకుంఠ వా పరిత్యక్ష్యే
నభక్తాం స్త్యక్తు ముత్బహే
మేతి ప్రియా హిమద్భక్తా
ఇతి సంకల్పవానసి
నేను వైకుంఠం నైనా విడిచి ఉంటాను గాని నా భక్తులను మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న దృఢ సంకల్పంతో శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చి భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. కానీ అప్పటినుండి ఆ స్వామి వారు స్థిరంగా ఉండక ఉండలేక ఉండడానికి వలను పడక పైన పేర్కొన్న అనేక సందర్భాల్లోనూ శ్రీ మహాలక్ష్మి చేత ఆకర్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఆర్తిగా లక్ష్మీ వెంటపడినాడు. భూమహాలక్ష్మి భూదేవి కోసం విచిత్రమైన వరాహ అవతారాన్ని ధరించినాడు ఆకాశరాజు పుత్రిక పద్మావతిగా అవతరించిన వేద లక్ష్మీ కోసం పరంధాముడు పరిపరి విధాల పరితపించినాడు మొహించి వివాహం చేసుకున్నాడు.
వెంకటాచలపతి కొల్హాపురంలోని మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరాటపడి పదేళ్లపాటు పడరాని పాట్లు పడుతూ తపస్సు చేశాడు వృధా ప్రయాస మాత్రమే మిగిలింది. అయినా ఏ మాత్రం పట్టువీడని స్వామివారు, ఆకాశవాణి ఆదేశం మేరకు పద్మసరోవర తీరాన ఆ మహాలక్ష్మి కరుణ కోసం కన్నులు కాయలు కాసేట్లుగా నిరీక్షిస్తూ పన్నెండేండ్ల పాటు తీవ్రంగా తపస్సు చేశాడు. చివరకు ఆమె కరుణించి, పద్మసరోవరంలో బంగారు పద్మంలో “అలమేలు మంగ”గా ఆవిర్భవించగా ఆ స్వామి ఆమెను ” వ్యూహలక్ష్మి”గా తన గుండెల మీద పదిలపరచు కొన్నాడు. ఆనాటి నుంచి వేంకటేశ్వరుడు ‘శ్రీనివాసుడు’ అనే సార్ధక నామధేయంతో వరాలినాడు. కావలసినన్ని వరాలను గుప్పిస్తూ వున్నాడు.
ఇలాగ జగదేకమాత అయిన అలమేలు మంగమ్మ అనుగ్రహం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అడుగడుగునా అర్రులు చాస్తూ అనేక విధాలుగా పరితపించి నాడు కదా! మరి సామాన్య మానవుడైన భక్తులు అలమేలు మంగమ్మ అనుగ్రహం కోసం, కరుణ కోసం ఎంతటి భక్తి ప్రపత్తులతో కీర్తించాలో, ఎంతటి వినయ వినమ్రంగా ఆరాధించాలో అవగతమవుతుంది.