-నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలు అందించండి
-అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిలు అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖమంత్రివర్యులు దృష్టికి తీసుకువచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలుపెడుతున్నవారి వివరాలను తక్షణమే అందించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.