Breaking News

ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం

-కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది
-విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసింది.
-వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, ఆయన బృందం అవిశ్రాంతంగా పని చేసింది
-కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
-రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆర్థిక కష్టాలు మాకు తెలుసు
-ప్రధానమంత్రి, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి న్యాయం చేస్తాం
-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
-కేంద్ర మంత్రికి ఆకస్మిక వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించి సాయం చేయాలని కేంద్రమంత్రికి వినతి పత్రం సమర్పించిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలను, ముంపుకు గురైన ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని పరిశీలించి తగు సాయం అందించడానికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించిన శివరాజ్ సింగ్ చౌహాన్ సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వరద నష్టంపై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన తిలకించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రికి వివరించింది.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విపత్కర పరిస్థితుల్లో చూడటం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తులు నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులకు, రైతుల పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా చూశానన్నారు. బుడమేరు వరద కారణంగా అపార నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కడైనా వర్షం, వరద వస్తే రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది కానీ రాష్ట్రంలో 5 రోజులు గడిచినా కూడా సాధారణ పరిస్థితులు నెలకొనకపోవడం బాధాకరమన్నారు. విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని ప్రశంసించారు. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, ఆయన బృందం అవిశ్రాంతంగా పని చేయడం అభినందనీయమన్నారు. కలెక్టరేట్ నే సచివాలయంగా చేసుకొని అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి, ఆయన బృందం పని చేస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని అభినందించారు. బస్సులోనే ఉంటూ ప్రజలకు సత్వర సాయం అందేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని, పోరాటాన్ని తాను అభినందిస్తున్నానన్నారు.

రైతన్నలను ఆదుకునేందుకు కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించడం వంటి చర్యలతో ప్రజలకు గత ప్రభుత్వం ఎలా నష్టం చేసిందో చూశామని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కొనసాగి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆర్థిక కష్టాలు తమకు తెలుసని కేంద్రమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రికి ఆకస్మిక వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రికి వివరించారు. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించి సాయం చేయాలని కేంద్రమంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1.81 లక్షల హెక్టార్లో వ్యవసాయ పంట నష్టం జరిగిందన్నారు. దీని వల్ల 2,05,194 మంది రైతులు నష్టపోయారని వివరించారు. తద్వారా రూ.1,056 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, తద్వారా 30,154 మంది ఉద్యాన రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. భారీ వర్షాల ధాటికి 3,756 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. అలాగే ఆక్వా రంగానికి కూడా నష్టం జరిగిందని వివరించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఆదుకోవాలని విన్నవించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరదలపై స్పందించిన విధానంపై రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *