– ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం.
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పరిసర గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా భరోసా కల్పిస్తోందని.. వరద కారణంగా ఇళ్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయని, వీటిని మరమ్మత్తు చేయించుకునే విషయంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారని తెలిపారు. వరదలతో ప్రజల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచి పాడైపోయాయని.. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలు సామాజిక బాధ్యతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాలను రాయితీపై అందించాలని కూడా కోరినట్లు వివరించారు. కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలందిస్తామని తెలిపినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీలు అవసరం మేరకు ఉదారంగా సేవలు అందించడం వల్ల బాధిత ప్రజలపై ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సేవా కేంద్రాలను, సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ విపత్కర పరిస్థితిలో బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నట్లు కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News