మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కొనకళ్ళ నారాయణరావు పార్లమెంటు సభ్యులుగా రెండు పర్యాయాలు పనిచేసి రాష్ట్రానికి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనకళ్ళ నారాయణరావును ఆర్టీసీ చైర్మన్గా నియమించిన నేపథ్యంలో గురువారం మంత్రి నగరంలోని కొనకళ్ళ నారాయణరావు స్వగృహానికి వెళ్లి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొనకళ్ళ నారాయణరావును ఆర్టీసీ చైర్మన్గా ప్రభుత్వం నియమించడం పట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. నారాయణ రావు నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులుగా పనిచేశారని ఆర్టీసీ గురించి వారికి అన్ని విధాల పూర్తిగా అవగాహన ఉందని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వారు లాభాల బాటలో నడిపిస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. గ్రామపంచాయతీలలో రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 6000 కోట్ల రూపాయల విడుదలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ చేశారని, దీనిపై విచారణ జరుగుతోందని బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల భారీ వర్షాలు బుడమేరు వరదల కారణంగా అతలాకుతలమైన విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11 రోజులపాటు ప్రజలకు అండగా నిలిచి సాధారణ స్థితికి వచ్చేంతవరకు అక్కడే ఉన్నారన్నారు. నీటి వనరులను ఎవరు కూడా ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు.
మచిలీపట్నంలోని 26 ఎకరాల మడుగు పోరంబోకు, స్మశాన భూములు, నీటి సంబంధమైన ప్రాంతాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకోవద్దని పట్టాలు రావని తాము ఇదివరకే చెప్పామన్నారు. అయినప్పటికీ కొందరు గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఇల్లు నిర్మించుకున్నారన్నారు. అక్కడి వారందరికీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటి నివేశన స్థలాలు కేటాయించి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్, డిపో లో నీరు నిలబడకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిన గురుతర బాధ్యత తనపై ఉందన్నారు
మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు నారాయణరావును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News