విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు సహాయమందించేందుకు కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఏపీ సీఎం సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళాన్ని సంస్థ అందజేసింది. కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఎండీ కె.ఎం.వి. ప్రసాద్ రావు, డైరెక్టర్ పృథ్వీరామ్ గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసిన కేఎంవీ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. విపత్తు సంభవించిన వెంటనే స్పందించిన కేఎంవీ.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ సాయమందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేసింది. అవసరమైన వనరులను యుద్ధప్రాతిపదికన సమీకరించుకుని కార్యక్షేత్రంలోకి దిగి బాధితులకు ఆపన్నహస్తమందించింది. ఊహించని విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన ప్రజల కష్టాలు తమ హృదయాన్ని కలచివేశాయని, వారిని ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించి సహాయ చర్యలను చేపట్టామని కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఎండీ కె.ఎం.వి. ప్రసాద్ రావు తెలియజేశారు. ఆ క్రమంలోనే, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళాన్ని అందజేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్రం ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News