గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ శ్యామలా నగర్ మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్నిపరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు జరగాలని, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు తమ పరిధిలో అనధికార, ప్లాన్ కి భిన్నంగా, జరిగే నిర్మాణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం, ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డి.పి.ఎం.ఎస్.లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు, నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతుల జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు.
పర్యటనలో అసిస్టెంట్ సిటి ప్లానర్ మురళి, టిపిఎస్ రిజ్వాన, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News