Breaking News

ప్రతి ఒక్కరిలోనూ ధీమా పెంచిన ఆనందయ్య మందు…

– ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా నివారణకు ఆనందయ్య మందు తీసుకున్నప్పటికీ వాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాల్సిన అవసరం ఉందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలిపారు. ఆనందయ్య మందు తీసుకుంటే వాక్సిన్ అవసరం లేదనే జరుగుతున్న ప్రచారం సరైనదికాదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వాక్సిన్ తో పాటు ఆనందయ్య మందు కూడా తీసుకుంటే మరింత మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఏపీ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సహకారంతో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో 300 మంది జర్నలిస్టులకు ఆనందయ్య మందు పంపిణీ జరిగింది. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబటి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆనందయ్య మందు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ కరోనా వచ్చినప్పటికీ బతుకుతామనే ధీమా ఏర్పడిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో హాస్పిటల్ కు వెళ్లాలంటే సామాన్య ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిన సమయంలో ఆనందయ్య మందు రావడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా ఈ మందుపై ఆసక్తి చూపడం అభినందనీయం. ప్రధానంగా సామాన్యుడికి కరోనా వచ్చినప్పటికీ ఆ మందు తీసుకుంటే బతుకుతామనే ధీమా వచ్చిందన్నారు. ఏపీ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎండి కరిముల్లా మాట్లాడుతూ ఆనందయ్య మందును ఏ విధంగా తీసుకోవాలో వివరించారు. కరోనా పాజిటివ్ ఉన్న వారికి కూడా తమ వద్ద మందు ఉందని వారికి కూడా ఉచితంగానే మందు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మందు తీసుకునే వారు ధూమపానం, మద్యం, మాంసాహారం వంటివి వారం పదిరోజులపాటు తీసుకోకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఐజేయూ కార్యవర్గ సభ్యులు డి సోమసుందర్ ప్రసంగించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జిల్లా ఛైర్మన్‌ అంజన్ కుమార్, నగర అధ్యక్షులు గోరు సలీమ్, ఎండి యాసీన్, యర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అభివృద్ధికి కావలసిన నిధులకు అనుమతులు మంజూరు

-ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల యొక్క అభివృద్ధి లో భాగంగా నేడు ప్రవేశ పెట్టిన పలు అజెండా అంశాలపై హాస్పిటల్ డెవలప్మెంట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *