Breaking News

స్వర్ణాంధ్ర@ 2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలి….

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తుల విలువ 15% పెరిగే విధంగా స్వర్ణాంధ్ర@ 2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర @2047 విజన్ పత్రం తయారీపై వివిధ వర్గాల వాటాదారులతో కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 2047 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ శుభ తరుణాన్ని అమృత్ కాలంగా పరిగణించి ఉత్సవాలు జరుపుకుంటూ ఉందన్నారు. 2047 నాటికి దేశం సమగ్రాభివృద్ధి సాధించడంతోపాటు ప్రపంచంలోనే 3 అగ్రగామి ఆర్థిక శక్తుల్లో మన దేశాన్ని ఒకటిగా నిలపాలన్నదే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర@ 2047 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ అభిప్రాయాలను సలహాలను సూచనలు అందజేయాలన్నారు. ఆర్థిక అభివృద్ధి సాంకేతికత ఆవిష్కరణలు సామాజిక సమానత్వం సంఘటితత్వం, వాతావరణ స్థిరత్వం, ప్రపంచ నాయకత్వం కార్యదక్షత వంటి కీలక అంశాలతో వికసిత్ భారత్ 2047 రూపొందుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, సంస్కృతి మానవ వనరుల సానుకూలత, సంస్కృతి కలలకు కాణాచి అందరికి అందుబాటులో ఉండే వివిధ రకాల సేవలు మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన కీలక అంశాలన్నారు.

జిల్లాలో స్థూల ఆదాయ ఉత్పత్తి( జిడిపి) పెంచేందుకు కోసం ఏ ఏ రంగాల్లో ఉత్పత్తులు పెంచే అవకాశాలు ఉన్నాయి వాటికి ఏ విధంగా చేయూత అందించాలి అనే అంశాల పైన జిల్లా కలెక్టర్ వివిధ వర్గాల ప్రజలను నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వివిధ రకాల యంత్రాలను డ్రోన్లను రాయితీలతో రైతులకు అందజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు చిరుధాన్యాలను సరఫరా చేయాలన్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి గ్రామాల్లో స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని భారీ నష్టానికి గురవుతున్నామని ప్రభుత్వమే ఏదైనా స్థలాలు కేటాయించాలని కోరారు. పచ్చిరొట్ట ఎరువు ఎంత కావాలంటే అంత ఇవ్వాలన్నారు. అయినంపూడి డ్రైనేజీ వలన ప్రతి సంవత్సరము పంట పొలాలు మునిగి రైతులు చాలా నష్టపోతున్నామని ఆ డ్రైనేజీ పూడికను సకాలంలో తొలగించాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ లజ్జ బండ డ్రైనేజీ కాలువను శుభ్రం చేస్తున్నామని అలాగే జిల్లాలో అన్ని డ్రైనేజీ కాలువలను పూడికలు తొలగించి శుభ్రం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెడనలోని కలంకారి అద్దకాలకు అధునాతన ఆకృతులపై శిక్షణ ఇవ్వాలని కొత్త వారికి కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని, ముడి సరుకులు సబ్సిడీపై అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

పసుపు అరటి మిరప వంటి పంటల నుండి చిప్స్, పొడులు వివిధ రకాల ఉత్పత్తుల తయారీ కోసం చిన్నపాటి ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లను కావాలని రైస్ మిల్లర్లు కోరారు. ఆక్వా కల్చర్ లో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని బయోప్లాక్ విధానంలో తక్కువ ఖర్చుతో ఫీడ్ తయారీ విధానాన్ని అవలంబించే ఏర్పాటు చేయాలన్నారు. కోడూరు ప్రాంతంలో అవుట్ ఫాల్స్ స్లూయిస్ సరిగా లేకపోవడంతో ఉప్పునీరు పంట పొలాల్లోకి ప్రవేశించి రైతులు చాలా నష్టపోతున్నారని వాటిని బాగు చేయించాలని జిప్సం అందిస్తే ఉప్పునీరు కొంతవరకు నియంత్రించడానికి ఉపయోగపడుతుందన్నారు

ప్రకృతి వ్యవసాయంలో ఆవులకు ఎంతో ప్రాధాన్యత ఉందని రైతులకు గిరి పుంగనూరు ఆవులను సబ్సిడీ పైన అందజేయాలన్నారు. కోళ్లు ఉత్పత్తి రాను రాను పడిపోతుందని కోళ్ల పెంపకానికి సబ్సిడీ అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పొలాల్లో కలుపు తొలగించు, గట్లు ఏర్పాటు వంటి పనులకు అవకాశం కల్పించాలన్నారు. సముద్రంలో చేపలు పట్టుటకు అవసరమైన శాస్త్ర సాంకేతిక సౌలభ్యాన్ని, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఏ పరిశ్రమకు ఏ నైపుణ్యం అవసరమో గుర్తించి ఆ నైపుణ్య శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యశాలలో సిపిఓ గణేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, ఎల్ డి ఎం జయవర్ధన్ ,జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి వెంకట్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, పర్యటక అధికారి రామ్ లక్ష్మణ్ తదితర అధికారులు, పలువురు పరిశ్రమలు రైతులు, చేనేత సంఘాల ప్రతినిధులు అనధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *