-వ్యవసాయానికి పండుగ చేసిన వై.యస్.ఆర్…
-తండ్రి ఆశయాలకు జవజీవాలను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి…
-రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుముంగిటకే అన్నిరకాల సేవలు…
-శాసనసభ్యులు కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతన్న ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి రైతులసంక్షేమానికి బాటలు వేసిన దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి ఆశయాలకు జవజీవాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కంకిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు కోటి రూపాయలు వ్యయంతో నిర్మించిన డా. వై.యస్.ఆర్. అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం శాసన సభ్యులు కొలుసు పార్థసారథి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, తదితర పధకాలతో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల మోముల్లో డా. వైయస్ఆర్ ఆనందాన్ని నింపారన్నారు. అదేబాటలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పయనిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వైయస్ఆర్ రైతుభరోసా క్రింద సాగుకు ముందే రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వై.యస్.ఆర్. ఉచిత పంటల భీమా పధకాన్ని అమలు చేస్తూ రైతులకు అండగా నిలిచారన్నారు. అధి కవర్షాలలో నష్టపోయిన రైతులకు నెలరోజుల్లోనే ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లించిన ఘనత సియం జగన్మోహన రెడ్డి కే దక్కుతుందన్నారు. రైతులు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే సిద్ధాంతంతో ఏముఖ్యమంత్రి చేపట్టని విధంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖర రెడ్డి వ్యవసాయరంగానికి ప్రాధాన్యతను ఇచ్చి రైతాంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలకు జవజీవాలను తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో వినూత్న పథకాలను ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలు ద్వారా సబ్సిడీ విత్తనాలే కాకుండా పురుగుమందులు, ఎ రువులు కూడా అందిస్తున్నారన్నారు. రైతులకు సదుపాయంగా ఉండేవిధంగా 1 గంటల ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచి పగటిపూటనే ఇస్తున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ అగ్రిటెస్టింగ్, ఆక్వాటెస్టింగ్ ల్యాబీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడు ఏయంసిలో రూ. 82 లక్షల నాబార్డు నిధులు, రూ. 16 లక్షల ఆర్ కెవివై నిధులతో కలిపి రూ. 98 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వాటెస్టింగ్ ల్యాబ్, పశువ్యాధి నిర్ధారణా ప్రయోగశాలలను అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈప్రాంత రైతులు భూసార పరీక్షలు, విత్తనాల నాణ్యతా పరీక్షలు, మత్స్య ఉత్పత్తుల నాణ్యతా పరీక్షలు, పశువ్యాధి నివారణకు అవసరమైన పరీక్షలను ఈల్యాబ్ ద్వారా చేయించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. వైయస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా మండలంలో ఉత్తమ రైతులుగా గుర్తించిన గుంటూరు దుర్గాభవాని, నెరుసు శ్రీమన్నారాయణ, ఆరేపల్లి రజనీకాంత్, టి.నాగి రెడ్డి, తదితరులను కొలుసు పార్థసారథి సన్మానించి ప్రశంసాపత్రాలను, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఏయంసి ఛైర్మన్ మద్దాలి రామచంద్రరావు, మాజీ జడ్ పి వైస్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, సర్పంచ్ బాకీ రమణ, వ్యవసాయశాఖ ఏడి యం. సునీల్, తహశీల్దారు టి.వి.సతీష్, యంపిడివో అనురాధ, మత్స్యశాఖ ఏడి చక్రాణి, పశుసంవర్ధకశాఖ ఏడి సాయిగోపాల్, మండల వ్యవసాయ విస్తరణాధికారులు టి.సుప్రియ, కె.శ్రీశైలవాణి, పి.సూర్యభవాని, యల్. శ్రీనివాస్, పియం . కిరణ్, మండల వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మన్ నత్తా వెంకటేశ్వరరావు, పలువురు ఆదర్శ రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.