Breaking News

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించే వరకు పోరాటం

-ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-బీజేపీవి చిల్లర రాజకీయాలు: పీసీసీ చీఫ్‌ షర్మిల
-ఈ నెల 6న విశాఖలో జరిగే మానవ హారానికి రౌండ్‌టేబుల్‌ సమావేశం సంఫీుభావం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అక్టోబరు 1, 2, 3 తేదిలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడి చేయటం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ ఛైర్మన్‌ కేసీ వేణుగోపాల్‌ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉక్కు అంశాన్ని రాజకీయం చేస్తుందని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు గాని, యాజమాన్యం గాని ప్రైవేటీకరణ చేయాలనుకోలేదన్నారు. ఇదీ కేవలం మోదీ ప్రభుత్వ నిర్ణయం అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరించాలనే ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇదీ ముమ్మాటికీ రాజకీయ నిర్ణయమే అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఆపేసిందని, బొగ్గు సరఫరా నిలిపేసిందన్నారు. ఒప్పంద కార్మికులను తొలగించి, శాశ్వత ఉద్యోగులను బదిలీ చేసి స్వతహాగా ఫ్యాక్టరీ మూతపడేలా చేస్తుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని అదానికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. స్టీల్‌ ఫ్లాంట్‌కి అప్పు ఇస్తే దానిని లాభాల్లోకి తీసుకువచ్చి అప్పు తీర్చే సామర్ధ్యం కార్మికులకు ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్టీల్‌ ఫ్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్రాన్ని కోరాలని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ పదేళ్లు మోసం చేసినా వైసీపీ, టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు లాభాల్లో ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నష్టాల్లోకి వచ్చిందన్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇందిగాగాంధీ జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమకి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు.

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు లేకపోవటం వల్ల ముడి సరుకు కొనుగోలుకే జీఎస్టీ ద్వారా రూ.2 వేల కోట్ల పన్ను భారం పడుతుందన్నారు. కార్మికులు పని చేయకపోవటం వల్ల ఫ్యాక్టరీకి నష్టాలు రాలేదని కేంద్ర చేస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలతోనే నష్టం వస్తుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సారధ్యంలో అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించేలా కేంద్రంపై ఒత్తిడి చేయమని కోరాలని సూచించారు.

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ మంత్రి నారాలోకేష్‌ విశాఖ పర్యటన తరువాత 4,200 మంది ఒప్పంద కార్మికులను తొలగించారని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించటంతో ఉద్యోగులను తొలగించటం లేదని కార్మిక శాఖ వద్ద నమోదు ప్రక్రియ చేయటం జరుగుతుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మనుగడకు చంద్రబాబు కీలకంగా ఉన్నందున మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించపోతే ఎన్డీఏతో తెగతెంపులు చేసుకునేలా విద్యార్థి, కార్మిక, రైతు, మహిళా సంఘాలు ఉద్యమించాలన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకపోవటం ప్రధాన సమస్య అన్నారు. విశాఖ స్టీల్‌ ఏర్పాటు కోసం విద్యార్థిలోకం ఉద్యమించటం జరిగిందన్నారు. అలాగే ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాలను కలిసి విద్యార్థులను ఉద్యమంలోకి తీసుకురావాలన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి ఉద్యమ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ విశాఖస్టీల్‌ ఫ్లాంట్‌కి చెందిన భూములు రాష్ట్రపతి పేరుతో ఉన్నాయని చెప్పారు. ఆ భూములను స్టీల్‌ పేరుకి మార్చితే వాటిని తాకట్టుపెట్టి స్టీల్‌ప్లాంట్‌ని నడిపించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యను ఉద్యోగుల సమస్యగా కాకుండా ప్రజాఉద్యమంగా మార్చాలన్నారు. ఎంసీపీఐ నాయకులు సయ్యద్‌ సలీం, వెంకట రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల, ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని, చేెతివృత్తిదారుల సంఘం నాయకులు భాస్కరరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకుడు మహంకాళి సుబ్బారావు, ఒడిషా మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, రెడ్‌ప్లాగ్‌ రాష్ట్ర నాయకులు ఎం.ప్రసాద్‌బాబు, సీపీఐ విశాఖప్నటం జిల్లా కార్యదర్శి మరుపిళ్ళ పైడిరాజు, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చుతరావు తదితరులు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మాట్లాడారు.
ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన అతిథులకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ స్వాగతం పలికారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, జంగాల అజయ్‌కుమార్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి టి.తాతయ్య, ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్షుడు కేఆర్‌ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, నాయకులు కొలనుకొండ శివాజి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు పి.పద్మ, ఇన్సాఫ్‌ రాష్ట్ర నాయకులు సయ్యద్‌ అప్సర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *