Breaking News

అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందించకపోతే చర్యలు తప్పక ఉంటాయి

-దిశ చైర్ పర్సన్ /తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
-అధికారులు చిత్త శుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు పనిచేయాలి: కో చైర్ పర్సన్ దిశ /చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు
-అర్హులైన పేదలకు, లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలి… దిశా సమావేశానికి గైర్హాజరైతే చర్యలు తప్పవు: దిశ సభ్య కార్యదర్శి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశం నిర్వహణ ద్వారా మన జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమన్వయంతో అందేలా అధికారులు చిత్త శుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని దిశా కమిటీ చైర్ పర్సన్ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు కో చైర్ పర్సన్, మెంబర్ సెక్రెటరీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంయుక్తంగా పేర్కొన్నారు.

బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశం గౌ. తిరుపతి ఎంపీ అధ్యక్షతన చిత్తూరు ఎంపీ కో చైర్ పర్సన్ గా, జిల్లా కలెక్టర్ మెంబర్ సెక్రెటరీ -దిశ హోదాలో నిర్వహించగా నెల్లూరు జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, గౌరవ తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, మండల ఎంపీపీ లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ తిరుపతి చైర్ పర్సన్ – దిశ హోదాలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది తొలి సమావేశం అని తెలిపారు. వచ్చే సారి నిర్వహించే సమావేశానికి లక్ష్య సాధనలో పురోగతి సాధించి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో, హాజరు కావాల్సి ఉంటుందని గైర్హాజరైనచో నోటీసులు పంపి చర్యలు ఉంటాయని అన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలతో పోటీపడి పనిచేసి లక్ష్యసాధన దిశగా అధికారులు అప్రమత్తంగా పని చేసి జిల్లాను ముందంజలో నిలపాలని కోరారు. అధికారులు నిబద్ధతతో పని చేయాలని, నిష్పక్ష పాతంగా పని చేసి అర్హులైన వారికి అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని, ఎవరైనా అడ్డుకుంటే పై స్థాయిలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఎంపీ చిత్తూరు కో చైర్ పర్సన్ -దిశ హోదాలో మాట్లాడుతూ కేంద్ర నుండి రాష్ట్రాల్లో సుమారు 54 పథకాలు అమలు అవుతున్నాయని, వీటి అమలు తీరు, పేద ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని సమీక్షించుకుని వాటిని సక్రమంగా వినియోగం కొరకు చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశం ఉద్దేశ్యం అని తెలిపారు. కొన్నింటిలో పూర్తి కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరి కొన్ని కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో అమలు అయ్యే పథకాలు ఉంటాయని, వాటిలో బిసి, ఎస్సి,ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాల వారికి కేంద్రం నుండి రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి, పట్టణ వార్డు స్థాయి వరకు ప్రభుత్వ ఫలితాలు సక్రమంగా అందేలా అధికారుల పనితీరు ఉండాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సభ్య కార్యదర్శి హోదాలో మాట్లాడుతూ కేంద్రం నుండి అమలు అవుతున్న పథకాలను సమన్వయంతో అమలు కొరకు జిల్లాల్లో సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం మూడు నెలలకు ఒకసారి నిర్వహించుకునేలా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలు మేరకు నిర్వహించు కుంటున్నామని, ప్రధాన మంత్రి ఈ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. అర్హులైన పేదలకు, లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. తదుపరి సమావేశం వచ్చే సంవత్సరం జనవరి మూడవ వారం ఉంటుందని తెలిపారు. సమావేశానికి సంబంధించిన సమాచారం గౌరవ సభ్యులకు ఇవ్వబడుతుందని పూర్తిస్థాయిలో ఒక రోజంతా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు అందే ప్రతి శాఖ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.

దిశ సమీక్షలో చైర్ పర్సన్, కో చైర్ పర్సన్ సమీక్షిస్తూ వ్యవసాయ శాఖ పెస్టిసైడ్ వాడకం, భూసార పరీక్షా కేంద్రం, సిసిఆర్సి కార్డులు క్రాప్ ఇన్సూరెన్స్ అంశాలపై అధికారులు వివరిస్తూ భూసార పరీక్షా కేంద్రం ఒకటే ఉందని ఇంకనూ అవసరం ఉందని తెలుపుతూ నివేదిక అందిస్తామని తెలిపారు. గాజుల మండ్యం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ కొరకు సభ్యులు కోరగా వచ్చే నెల మొదటి వారంలో అక్కడి రైతులతో చర్చించి కో-ఆపరేటివ్ అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ పురోగతి మరింతగా ఉండాలని సూచించారు. టిడ్కో నందు నిధుల లేమితో పనులు పురోగతి లేదని అధికారులు తెలిపారు. పిఎం ఉజ్వల యోజన పై గ్యాస్ సిలిండర్లపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సివిల్ సప్లైస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, ఆలాంటివి గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని, వాటి వివరాలు తదుపరి సమావేశంలో సమర్పించాలని స్పష్టం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు దుర్వినియోగం చూడాలని, మంజూరు చేసిన పనులు త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాల అధికారులు హాస్టళ్లలో మరుగు దొడ్లు, కిచెన్ వంటి వాటికి మరమ్మత్తుల కొరకు అంచనాలు సీసీ రోడ్లు, డ్రెయిన్లు తదితర నిర్మాణాలకు నిబంధనలకు లోబడి వినియోగించాలని సూచించారు. సి ఎస్ ఆర్ నిధులు కూడా వినియోగానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ కౌశల్ యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన ఇచ్చేలా చూడాలన్నారు. స్కిల్ సెన్సస్ నవంబర్ ఒకటి నుండి జరుగుతుందని, అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అర్హులైన అందరికీ పెన్షన్ల పంపిణీ జరగాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆస్తుల కల్పన, అనిమల్ షెల్టర్ ల ఏర్పాటు తదితర అంశాల అమలు జిల్లాలో బాగా ఉందని, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే ఓపెన్ కేటగిరీ వారి నివాస ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలకు, శిశువులకు అందించే పౌష్ఠిక ఆహారం, సంపూర్ణ పోషణ అభియాన్ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.

సమీక్షలో అంగన్వాడి కార్యకర్తల నియామకం చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నవంబర్ నాటికి భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా శాఖ వారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, డిఎస్సీ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల చేపట్టాలని , డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు, తదితర విద్యా సంబంధ అంశాలు పక్కాగా అమలు చేయాలని, విద్యార్థుల పాస్ పర్సంటేజ్ పెరిగేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మునిసిపల్ కమిషనర్ తిరుపతి అమృత్ 1.ఓ, 2. ఓ, టిఎస్ సిసిఎల్, స్వాప్ (SWAP), ఎస్బిఎం స్వచ్చ భారత్ మిషన్ (SBM), 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర ప్రాజెక్టుల వివరాలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న మల్టీ లెవెల్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ కాంప్లెక్స్ తదితర ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కొరత నుండి ఆగి ఉన్న వాటి పురోగతికి నిధుల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

జడ్పీ చైర్మన్ నెల్లూరు మాట్లాడుతూ వాకాడు, నాయుడుపేట, బీఎన్ కండ్రిగ మండలాల్లో అంగన్వాడీ అద్దె భవనాలలో ఉన్న వాటికి స్వంత భవనాలు నిర్మాణానికి జడ్పీ నిధులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *