-స్పందన ఫిర్యాదుల స్వీకరణపై గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి…
-ఫిర్యాదులను హేతుబద్ధంగా నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి…
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పరిష్కారం స్పందన కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను రాష్ట్ర స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకూ సకాలంలో పరిష్కారం అయ్యేలా సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్ఫరెన్స్ హాల్లో స్పందన ఫిర్యాదులపై వివిధ శాఖల కార్యదర్శులతో నెలవారీ సమీక్షించ నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ స్పందన ద్వారా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ద్వారా తన సమస్య పరిష్కారం అయిందనే సంతృప్త భావన వారిలో కలిగి ప్రభుత్వ వ్యవస్థపై ఒక నమ్మకం కలిగించే రీతిలో ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు.ప్రతి వారం ముఖ్యమంత్రి స్థాయిలో ఈస్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష జరుపుతున్న నేపధ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని పరిగణలో ఉంచుకుని ఆయా శాఖలు స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.ఇకమీదట నెలవారీ కార్యదర్శులతో సమావేశమై ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించనున్నట్టు సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. స్పందన నూతన అప్లికేషన్ ను ఈఏడాది మార్చి 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 2లక్షల 3వేల 528 ఫిర్యాదులు (గ్రీవియెన్స్లు) రాగా వాటిలో లక్షా 44వేల 351 అనగా 71 శాతం పరిష్కారం కాగా మరో 41వేల 493 అనగా 20 శాతం ఫిర్యాదులు పొగ్రస్ లో ఉన్నాయని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.అలాగే విత్ ఇన్ ఎస్ఎల్ఏ కింద 10వేల 593,ఎస్ఎల్ఏ పరిధిమించినవి 30వేల 900 ఉన్నాయని తెలిపారు.రీఓపెన్ చేసిన ఫిర్యాదులు 17వేల 684 ఉన్నాయని వాటన్నిటినీ సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ చెప్పారు.స్పందన ఫిర్యాదులను కేటగిరీల వారిగా చూస్తే వివిధ పధకాలకు సంబంధించినవి లక్షా 32వేల 341 అనగా 65శాతం ఉండగా నాన్ స్కీమ్ రిలేటెడ్ వి 71వేల 187 అనగా 35శాతం ఉన్నాయని చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్ఆర్కె విజయకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పందన ఫిర్యాదుల పరిష్కారం ప్రగతిని వివరించారు.స్పందన ఫిర్యాదులకు సంబంధించి ప్రధానంగా 80శాతం ఫిర్యాదులు 7శాఖలకు సంబంధించినవే ఉన్నాయని వివరించారు.వాటిలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,మున్సిపల్ పరిపాలన శాఖ,గ్రామ వార్డు సచివాలయాలు,వ్యవసాయ సహకార శాఖ,రెవెన్యూ,వెనుకబడిన తరగతులు,విద్యాశాఖలకు సంధించినవి అధికంగా ఉన్నాయని తెలిపారు.స్పందన ఫిర్యాదులను క్రిటికల్,హై,జనరల్ అనే మూడు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. స్పందన నూతన అప్లికేషన్ ప్రారంభించక ముందు 2లక్షల 70 వేల ఫిర్యాదులు రాగా కింద మొత్తం 4లక్షల 71 ఆతర్వాత మరో 2లక్షల 3వేల పిర్యాదులు వచ్చాయని వివరించారు.ఈ స్పందన ఫిర్యాదులకు సంబంధించి శాఖల వారీ జిల్లాల వారీ స్కీమ్ లవారీ డాష్ బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు.అంతేగాక కార్యదర్శులు,శాఖాధిపతులు మొదలు క్షేత్రస్థాయి వరకూ లాగిన్ ఐడిలను క్రియేట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్,పూనం మాలకొండయ్య,సతీష్ చంద్ర,కరికాల వల్లవన్,అనంతరాము,ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు,ఎఆర్ అనురాధ,వి.షారాణి, జయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, బి.రాజశేఖర్, కె.సునీత,వాణి మోహన్,ఇంకా పలు శాఖల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.