-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత) శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరీ వెల్లడి
-ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య లోటు అధ్యయనాల (Skill Gap Studies) పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) ఆధ్వర్యంలో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) స్థాపించటం జరిగింది. 2019 నుండి ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఎపిలో పలు పరిశ్రమల అవసరాన్ని బట్టి నైపుణ్య లోటు అధ్యయనాలు నిర్వహించటం జరిగిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత) శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) ద్వారా చేపట్టిన నైపుణ్య లోటు అధ్యయనాల (Skill Gap Studies) వివరాలు, ఎన్ని జిల్లాల్లో ఈ అధ్యయనాలు నిర్వహించబడ్డాయనే వివరాలు, కొత్త ఏర్పడిన జిల్లాల్లో ఈ అధ్యయనాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదనాలు పంపించటం జరిగిందా అనే అంశాలపై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖను లోక్ సభలో సోమవారం అడగటం జరిగింది. వీటికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత) శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరీ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
ఎపిలో 2019 నుండి వివిధ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSC) కార్మిక వనరుల పరిశీలన, నైపుణ్య అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలు, పరిశ్రమ అవసరాలను అంచనా వేయడం వంటి అంశాలపై అధ్యయనాలు నిర్వహించాయి. 2019లో ఆటోమోటివ్ నైపుణ్య అభివృద్ధి మండలి అధ్యయనం నిర్వహించగా, బి.ఎఫ్.ఎస్.ఐ రంగానికి సంబంధించి 2020లో అధ్యయనం జరిగిందని పేర్కొన్నారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో పలు రంగాలకు సంబంధించి సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) అధ్యయనాలు చేపట్టినట్లు తెలిపారు. 2023లో వ్యవసాయ, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, గ్రీన్ జాబ్స్ రంగాలకు సంబంధించి అధ్యయనాలు జరగ్గా, 2024లో టెలికాం, పర్యాటక అతిథ్య రంగాల్లో పరిశీలనలు జరిగినట్లు తెలిపారు. ఈ అధ్యయనాలు నైపుణ్య లోటును గుర్తించి, సంబంధిత రంగాల్లో శిక్షణా కార్యక్రమాలను మెరుగుపరిచేలా మార్గదర్శకాలు అందించాయని చెప్పారు.
నైపుణ్య లోటును సమర్థవంతంగా అంచనా వేయడానికి సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ( SSC) లు కొన్ని ప్రత్యేక జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టగా. ఆటోమోటివ్, నిర్మాణ, హైడ్రోకార్బన్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ పరిశీలనలు నిర్వహించగా, ఇతర పరిశ్రమల్లో ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అమరావతి, చిత్తూరు, కొనసీమ, కృష్ణ, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో పరిశోధనలు జరిగినట్లు పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధికి అవసరమైన డిమాండ్‌ను గుర్తించేందుకు జిల్లా నైపుణ్య అభివృద్ధి ప్రణాళికలు (DSDPs) 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ ప్రణాళికల ప్రకారం, పరిశ్రమల అవసరాలను అంచనా వేసి, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయనుందని తెలిపారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పరిశీలనలు ఆలస్యం కావడానికి పలు కారణాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అభివృద్ధి ఇంకా కొనసాగుతుండటం, ప్రభుత్వ ప్రాధాన్యత మౌలిక వనరుల అభివృద్ధికి కేంద్రీకృతమై ఉండటం, కొన్ని సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSC) రాష్ట్ర స్థాయిలో మాత్రమే అధ్యయనాలు నిర్వహించడం వంటివి ఆలస్యానికి కారణంగా పేర్కొన్నారు.. అయితే, ప్రభుత్వ అనుసంధాన సంస్థలు త్వరలో ఈ జిల్లాలకు ప్రత్యేక అధ్యయనాలు చేపట్టే అవకాశముందని తెలిపారు. అలాగే
ప్రభుత్వం నైపుణ్య లోటు (Skill Gap Studies)ను భర్తీ చేసే దిశగా మరిన్ని పరిశీలనలు చేపట్టేలా ప్రణాళికలను రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను మరింత సమగ్రంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.