గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే సదరు స్థలాలలో గుంటూరు నగర పాలక సంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. శనివారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా ఐ.పి.డి కాలనీ, యల్.ఆర్ కాలనీ, సంగడి గుంట, వినాయక నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, నివాసాల మధ్యలో ఖాళీ స్తలాలు అపరిశుభ్రంగా, పిచ్చి మొక్కలతో ఉంది తీవ్ర అసౌకరంగా ఉందని ప్రజల వద్ద నుండి అనేక పిర్యాదులు అందుతున్నాయన్నారు. వార్డు సచివాలయాల వారీగా స్థల యజమానులను గుర్తించి, స్థలాలను శుభ్రం చేసుకోవాలని నోటీసు లు అందించాలని, స్పందించని యజమానుల స్థలాల్లో నగర పాలక సంస్థ బోర్డు లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే నివాస ప్రాంతాల్లో పందుల పెంపకం నిషేదమని, ప్రజారోగ్య దృష్ట్యా పందుల యజమానులకు నివాసాల మధ్యలో పెంపకం చేయకూడదని నోటీసులు ఇవ్వాలన్నారు. ప్రజలు తమ ఇళ్ళ వద్దే వ్యర్ధాలను తడి పొడి చెత్తలు విభజించి పారిశుధ్య కార్మికులకు ఇచ్చేలా సచివాలయ కార్యదర్శులు వారికి అవగాహన కలిగించాలన్నారు. వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమినిటి కార్యదర్శులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సదరు పర్యటనలో ఎ.ఈ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
