– ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి
– స్వచ్ఛాంధ్రలో జిల్లాను నెం.1గా నిలిపేందుకు కృషిచేయాలి
– ఈ ఏడాది చివరినాటికి అన్నింటా 100 శాతం మైలురాయిని చేరాలి
– స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం/గుంటుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మనం బాగుంటే సమాజం బాగుంటుంది.. సమాజం బాగుంటే మనం బాగుంటాం.. ప్రజల జీవన నాణ్యత పెరగాలంటే స్వచ్ఛతా మార్గం చాలా ముఖ్యమని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఇంకుడుగుంతలను పరిశీలించడంతో పాటు ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రం ద్వారా ఉత్పత్తి చేసిన కంపోస్ట్ ఎరువు విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఈ నెల మూడో శనివారం కూడా సోర్స్-రిసోర్స్ ఇతివృత్తంతో ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ స్వచ్ఛతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోర్స్ వద్దే చెత్తను వేరు చేయడం, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, చెత్త నుంచి సంపద సృష్టించడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇలా చెత్తను సద్వినియోగం చేసుకోవడం ద్వారా లభించే మొత్తాన్ని గ్రామాభివృద్దికి ఉపయోగించుకోవచ్చన్నారు. సర్క్యులర్ ఎకానమీకి ఇలాంటి వినూత్న చర్యలు చాలా కీలకమన్నారు. తడిచెత్త-పొడి చెత్తను ఇంటివద్దే వేరుచేసి అందించడం వల్ల తడి చెత్తను కంపోస్ట్ పిట్‌లో వేయడం ద్వారా దాదాపు 40 రోజుల్లోనే ఎరువుగా మారుతుందని.. కిలో రూ. 20 చొప్పున విక్రయించే ఈ ఎరువుకు మంచి డిమాండ్ ఉందన్నారు. రైతులు కూడా పెద్దఎత్తున వర్మీకంపోస్ట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విధానాలను పాటించకుండా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తే అది డ్రెయిన్లలోకి చేరడంతో బ్లాక్ అయ్యే ప్రమాదముందన్నారు.
ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి:
భూగర్బ జలాల వృద్ధితో పాటు స్వచ్ఛతకూ దోహదం చేసే ఇంకుడు గుంతలను ప్రతిఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని, గ్రామపంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే రూ. 6 వేల మంజూరుతో నరేగా ద్వారా గుంతల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవచ్చన్నారు. ప్రత్యేక చొరవలో భాగంగా శనివారం జిల్లాలో 1,365 గుంతల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మండల, డివిజన్, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ ఏడాది చివరినాటికి చెత్త సేకరణ, సరైన విధంగా విభజన, చెత్తనుంచి సంపద సృష్టించడం, పరిసరాల పరిశుభ్రం.. ఇలా ప్రతివిషయంలోనూ 100 శాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం ఒక ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మన గ్రామం పరిశుభ్రంగా ఉంటే, మన మండలం పరిశుభ్రంగా ఉంటుంది.. మన మండలం పరిశుభ్రంగా ఉంటే మన జిల్లా, ఆపై రాష్ట్రమే స్వచ్ఛతలో దేశానికే ఆదర్శరంగా నిలుస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ.. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.