– విజయవంతంగా స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ ప్రత్యేక కార్యక్రమాలు
– ప్రతినెలా ఒక్కో ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని.. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌తో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా మూడో శనివారం రోజున రెడ్డిగూడెంలో జరిగిన స్వచ్ఛ దివస్ కార్యక్రమాల్లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న విధానంతో పాటు తడిచెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తున్న తీరును పరిశీలించారు. వేర్వేరు బిన్స్‌లో తడిచెత్త, పొడిచెత్త, హాజార్డస్ చెత్తను ఎలావేయాలో.. వాటిని పారిశుద్ధ్య సిబ్బందికి ఎలా అందజేయాలనే విషయాన్ని వివరించారు. నేను నా పరిసరాల పరిశుభ్రతకు రోజూ కొంత సమయం వెచ్చిస్తానని, నా వంతు బాధ్యతగా స్వచ్ఛతా కార్యక్రమాల కోసం శ్రమదానం చేస్తానని, ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడంలో నా వంతు కృషిచేస్తానంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ లక్ష్మీశ ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని.. సుస్థిర అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు స్వచ్ఛత కూడా కీలకమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీవో పి.లావణ్య కుమారి, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, ప్రత్యేక అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.