Breaking News

న్యాయ విచారణలో డిజిటల్ ఎవిడెన్స్ పాత్ర కీలకం

-పోలీస్, లాయర్ వృత్తి ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయొచ్చు
-ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాలను కూడా నిశితంగా పరిశీలిస్తారు
-నేరాల నియంత్రణలో నూతన సాంకేతికతను వినియోగించాలి*
-ఆధారాలు పోలీసులిస్తే, శిక్షపడేలా చేయాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్లే
-టెక్నాలజీతో ట్రాఫిక్ తగ్గించడం సులభం-విజయవాడలో అమలు
-పీపీలుగా 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు
– రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించడంతోపాటు ఆన్ లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడ జీఆర్టీ హోటల్లో ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ప్రాముఖ్యత పై జరిగిన రాష్ట్రస్థాయి వర్క్ షాప్ కి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదైన నాటి నుంచి లీగల్ వ్యవస్థ పోలీసులకు కేసు పురోభివృద్ధి లో సహకరించాలన్నారు. సమాజానికి ధైర్యమిచ్చే వారు పోలీసులైతే, ప్రజలకు ధైర్యం చెప్పి న్యాయం చేసేవారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అని అన్నారు. మారుతున్న కాలంలో న్యాయ విచారణలో డిజిటల్ ఎవిడెన్స్ పాత్ర చాలా కీలకంగా మారిందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) అందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి మంచి సదస్సు నిర్వహించడం చాలా సంతోషదాయకమని, వర్క్ షాఫ్ లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉండడం శుభ పరిణామమన్నారు. న్యాయవిచారణ ను వేగంగా పూర్తి చేసేందుకు ఇవాళ తొలి అడుగు పడిందన్నారు. పోలీస్, లాయర్ ల వృత్తిలోకి మీ లాంటి వారు రావడం గొప్ప విషయం అన్నారు. నేరస్థులను పట్టుకోవడానికి అందరం కలిసి సాంకేతికంగా చాలా అప్ గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్ లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగించడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్న, చిన్న విషయాలను కూడా నిశితంగా పరిశీలిస్తారన్నారు. ఏదైనా నేరానికి సంబంధించి ఆధారాలిచ్చేది పోలీసులు అయితే వారికి శిక్షపడేలా చేయాల్సింది పీపీ లు‌ అన్నారు. పోలీసులు, పీపీ లు కలిసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదామన్నారు. ఇప్పటి నేరాలను చూస్తే దొంగలు ఇప్పుడు చాలా తెలివిమీరి పోయారని తెలుస్తుందని, ఎంతటి తెలివిగలవారైనా ఎక్కడో ఒక చోట ఆధారం వదలి వెళ్లతారన్నారు. నేరస్థులను పట్టుకోవడానికి మనం చాలా అప్ గ్రేడ్ అవ్వాలన్నారు.

పోలీస్, న్యాయ వ్యవస్థ లు సమన్వయంతో చాలా కేసులను అనుకున్న సమయంలోనే చేధించొచ్చు అన్నారు. ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ నమోదైన నాటి నుంచి లీగల్ వ్యవస్థ పోలీసులకు సహకరించాలన్నారు. ఎంతటివారైనా కోర్టుకు వస్తే చేతులు కట్టుకుని నిల్చునేంతటి గౌరవం మన న్యాయ వ్యవస్థకుందని, అదేవిధంగా పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కూడా ప్రజలు ఆ విధంగా గౌరవించే విధంగా మనం చేయాల్సి ఉందన్నారు. ఉయ్యాల్లో ఉన్న పసిపాపల మీద కూడా అత్యాచారాలు జరుగుతుండడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. నేరస్థుడు దొరికినా, నేరం అంగీకరించినా శిక్ష అమలు చేసే దాకా పడే కష్టం మామూలుదికాదన్నారు. నేరస్థుడు దొరికినా చట్ట ప్రకారమే శిక్షించాల్సి రావడం వల్ల కేసు పూర్తయ్యేదాకా ప్రతి విషయం కీలకమేనన్నారు. విజయనగరం జిల్లాలో రెండు కేసుల్లో నిందితులకు 6 నెలల్లోపే శిక్ష పడే విధంగా మన వాళ్లు పనిచేసారన్నారు. న్యాయవ్యవస్థకు అవసరమైన వనరులు, వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. బడ్జెట్ కూర్పు సమావేశాల్లో కూర్చుని సమాజానికి మంచి చేసే ప్రతిపాదనలివ్వడం మరచిపోలేనన్నారు. దొంగతనాలు, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అన్నారు. విజయవాడ నగరంలో ప్రోటోకాల్ లేకుండా ట్రాఫిక్ లో ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశానన్నారు.
విజయవాడ నగరంలో ఆస్ట్రామ్ (ASTraM) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించడం సులభంగా చేస్తున్నారన్నారు. సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాక్షన్ చేయదగిన ఇంటెలిజెన్స్‌గా నిర్వచించబడిన ఆస్ట్రామ్, డ్రోన్‌లను ఉపయోగిస్తుందన్నారు. అనంతపురంలో ప్రియుడు ప్రియురాలి నంబర్ ని బ్లాక్ చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ విధంగా కూడా పోలీసులు సేవలు అందిస్తున్నారన్నారు. ఏ కష్టం కలిగినా కాపాడేది పోలీసులే అన్న ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులు, పోస్కో కోర్టులు ఎన్నో ఉన్నాయన్నారు. తొందరగా న్యాయం చేయడమే అసలైన న్యాయం అని అన్నారు. బాధితులకు అండగా నిలవడానికి మనమందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులతో చేయాల్సిన మంచి పని చేయకుండా ఎవరూ అక్కడే ఆగిపోకూడదన్నారు. పీపీలది వృత్తి కాదు సామాజిక బాధ్యత అని గుర్తించాలన్నారు. జీవితంలో ఏదో కోల్పోయి మీదరికి చేరిన వారిని అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత పీపీ లపై ఉందన్నారు. సమాజ గౌరవం, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే దిశగా పీపీ లు ముందుకెళ్లాలన్నారు. నేరం జరిగిన తరువాత బెయిల్ రాకముందే శిక్షపడే స్థాయిలో పని చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకుసాగుదామని మంత్రి వంగలపూడి అనిత పిలుపినిచ్చారు.

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర్ బాబు మాట్లాడుతూ ఇంట్లో టివి, ఫ్రిజ్ ఉన్నట్టు, సిసి టీవీ కూడా ఉండాలన్నారు. డ్రోన్ సహాయం తో విజయవాడలో ట్రాఫిక్ జామ్ పై దృష్టి పెట్టామన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ కు డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే పోలీసులు గుర్తొస్తున్నారని, అంతవరకు సంతోషం గా ఉందన్నారు. ప్రజలకు అర్ధమయ్యే భాష లో ప్రాసిక్యూటర్లు కూడా మాట్లాడితే కేసు ఏంటి అనేది అర్ధం అవుతుందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు కలిసి పని చేస్తే తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్థ కు పోలీసు ల సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.

డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. మొదటి సారి పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత విషయంలో విజయవాడ పోలీసులు చాలా ముందు ఉన్నారన్నారు.

ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్) సంస్థ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, ఐపీఎస్, మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి అందరం కలసి అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. నార్కొటిక్స్ కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర విభాలన్నింతోపాటు పీపీల సహకారం ఎంతో అవసరం అన్నారు. అనంతర సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

ఉదయం వర్క్ షాపు సెషన్ లో డిజిటల్ ఎవిడెన్స్ పై ఏపీఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. లక్ష్మీ నరసింహ స్వామి అనేక విషయాలపై కూలంకుషంగా వివరించారు. సాంకేతికతలో పురోగతి మరియు సైబర్ నేరాల దర్యాప్తుపై ప్రభావం అనే అంశంపై ఏపీ హైకోర్టు అడ్వకేటు ఏ. మిథున్ కుమార్ వర్క్ షాపులో వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

 తేదిన గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *