– నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని.. అదే విధంగా నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం రాత్రి విజయవాడ అర్బన్, వన్‌టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియాతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితరాలను కూడా పరిశీలించారు. భోజనం నాణ్యత ఎలా ఉందో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మంచి ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణంలో పేదలు భోజనం చేసేందుకు ప్రభుత్వం ఆవకాశం కల్పించిందన్నారు.ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంతమవుతుందని.. ఇలాంటి ఓ మంచి కార్యక్రమంలో భాగమవుతున్న సిబ్బంది నిబద్ధత, సేవా దృక్పథంతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి క్యాంటీన్‌లోనూ అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.