-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఏ.యస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థకు బకాయిదారులందరకు పన్ను చెల్లింపునకు ఎటువంటి గడువు లేదని, ఆస్తి పన్ను పై వడ్డీ రాయితీ కూడా లేదని నగర పాలక సంస్థ బకాయిదారుల ఆస్తుల సీజ్ కు నగర పాలక సంస్థ ఉపక్రమించిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ గారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థకు బకాయిలు చెల్లించని 278 నివాసాలు మరియు వ్యాపార సంస్థలకు నీటి కుళాయిలు తొలగించడమైనదన్నారు. అలాగే మొండి బకాయిలుండి స్పందించని లాలుపురం రోడ్డులోని రేణుకా కాటన్ జిన్నింగ్ మిల్ (రూ.5,61,894), ఏటుకూరు రోడ్డులోని పద్మావతి కాటన్ జిన్నింగ్ మిల్ (రూ.16,97,719), రాజరాజేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లు (రూ.4,93,274), గోపాల కృష్ణ కాటన్ జిన్నింగ్ మిల్లు (రూ.4,93,274), విష్ణు ప్రియ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 61 (రూ. 78,131), పట్నం బజారు లోని టి. శ్రీనివాసరావు కు చెందిన కిరాణా స్టోర్ (రూ.1,68,078) లను సీజ్ చేయుట జరిగిందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించని సంస్థలను సీజ్ చేయుట వేగవంతం అవుతుందని, ఆస్తి పన్ను పై వడ్డీ రాయితీ లేనందున ప్రతి ఒక్కరూ వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే పన్ను వసూళ్ళలో రోజువారీ వసూళ్ల లక్ష్యాన్ని చేరని ఆర్.ఐ లు నాగరాజు, సుబ్బారావు లకు, 10 మంది అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, శుక్రవారం నాటికి పురోగతి కనబరచాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. శుక్రవారం నుండి రోజుకు సచివాలయల వారీగా బకాయిలు చెల్లించని నివాసాలకు కనీసం రెండు కుళాయిల తొలగించాలని కార్యదర్శులను, రెవిన్యూ ఇన్స్పెక్టర్ల వారిగా నగర పాలక సంస్థ కు బకాయిలున్న ఐదుగురీ ఆస్తులను సీజ్ చేసి, సదరు వివరాలను అందించాలని ఆదేశించారు.