-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్యంలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) చెరగని ముద్ర వేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. తెలుగు సాహిత్యంలో ఆమె రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గురువారం మొల్ల జయంతి సందర్బంగా రాష్ట్ర సచివాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్లమాంబ శ్రీరాముడిని అచంచలమైన భక్తి ప్రపత్తులతో కొలిచారన్నారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించించిన మహానీయురాలు మొల్ల అని కొనియాడారు. తెలుగు వాడుక భాషలోకి ఆమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రఖ్యాతగాంచిందన్నారు. మొల్ల తన రచనలలో నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారన్నారు. తెనాలి రామలింగడ వంటి దిగ్గజ కవులకు మొల్ల సమకాలీనరాలు అని చరిత్ర చెబుతోంది. కడపలోని గోపవరం గ్రామంలో జన్మించిన మొల్ల నేటి తరం మహిళాలకు, కవయిత్రిలకు ఆదర్శమని కొనియాడారు. ఆమె రచనలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.