-బ్రష్ స్ట్రోక్‌తో మద్దతు తెలిపిన మంత్రి నారా లోకేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమ విశేషాలను తెలుసుకున్న మంత్రి, స్వయంగా కాన్వాస్‌పై బ్రష్ స్ట్రోక్ వేసి కళాకారులు మరియు విద్యార్థులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు.
కార్యక్రమ వివరాలను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్, అమరావతి చిత్రకళా వీధి కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదని, ఇది రాష్ట్రంలోని కళాకారులకు ఒక విశాలమైన వేదికను కల్పించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ఒక గొప్ప సామాజిక ఉద్యమమని కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పెయింటింగ్ కిట్లు పంపిణీ చేయాలనే నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కళాకారులను ప్రోత్సహించే ప్రతి మంచి కార్యక్రమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొదపాటి గారు ఈ కార్యక్రమ ఉద్దేశాలను వివరిస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది చిత్రకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఈ ఉత్సవం ఒక వారధిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆగస్టు 8, 9 తేదీల్లో గుంటూరు వేదికగా జరగనున్న ఈ సృజనాత్మక వేడుక రాష్ట్ర కళా వైభవాన్ని చాటిచెప్పడమే కాకుండా, కళాభిమానులను, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురానుంది.
Prajavartha Online Telugu News