-రెండు నెలల కసరత్తు అనంతరం తయారైన ముసాయిదా
-చిన్న క్లినిక్ నుంచి పెద్దాసుపత్రుల వరకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
-నిబంధనలు పాటించకుంటే జరిమానాలు.. అనివార్యమైతే గుర్తింపు రద్దు కూడా
-కొత్త ముసాయిదాపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష
-ప్రజలు, వైద్యులు, మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు
-అనంతరమే ముసాయిదా ఖరారు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకురాబోతుంది. చిన్న క్లినిక్ నుంచి 200 పడకలకు పైబడిన ఆసుపత్రి వరకు ప్రతి ఆయుష్ ప్రైవేట్ వైద్య సంస్థ నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. అర్హత లేని వ్యక్తులు నిర్వహించే నకిలీ వైద్య కేంద్రాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన ముసాయిదా నిబంధనలను రూపొందించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుష్ అధికారులతో లోతుగా చర్చించారు. ఈ మేరకు మంత్రి జారీచేసిన ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదాపై ప్రజలు, ఆయుష్ వైద్య రంగానికి చెందిన నిపుణులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు బుధవారం చర్యలు చేపట్టారు. వీటిని పరిశీలించిన అనంతరమే కొత్త నిబంధనలు జారీ చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఆయుష్ వైద్యానికి చట్టబద్ధత
ఇప్పటివరకు అల్లోపతి ప్రైవేట్ వైద్య సంస్థలకు మాత్రమే వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం-2002ను ప్రభుత్వం సవరించింది. చట్టం నంబరు 18/2026 ద్వారా ఆయుష్ వైద్య విధానాలను కూడా దీని పరిధిలోకి తెస్తూ ఏప్రిల్ 10న గెజిట్ నోటిఫికేష్ విడుదల చేసింది. దీని అమలుకు ‘ఆంధ్రప్రదేశ్ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యురేషన్) రూల్స్-2026’ పేరుతో ముసాయిదా నిబంధనలను సిద్ధం చేసింది. కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలతో పాటు మిషన్ ఆయుష్ మార్గదర్శకాలను అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సాంకేతిక నిపుణులు, వైద్యులు, ఇతర భాగస్వాములతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. రెండు నెలల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన కసరత్తు అనంతరం ఈ ముసాయిదాకు తుదిరూపం ఇచ్చారు.
ముఖ్యాoశాలు:
అసుపత్రుల స్థాయిని బట్టి 7 రకాలుగా వర్గీకరణ, రిజిస్ట్రేషన్లు
ముసాయిదా పేర్కొన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వైద్య సంస్థలు అందిస్తున్న సేవలు, పడకల సామర్థ్యం ఆధారంగా ఏడు విభాగాలుగా వర్గీకరించారు. సింగిల్ డాక్టర్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, 20 పడకలలోపు ఆసుపత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆసుపత్రులు ఈ కేటగిరీల పరిధిలోకి వస్తాయి. ఒకే సంస్థలో ఒకటి కంటే ఎక్కువ రకాల వైద్య సేవలు అందిస్తుంటే ప్రతి కేటగిరీ కింద విడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు.. 10 రోజుల్లో తనిఖీలు
అన్ని దరఖాస్తులను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సమర్పించాలి. దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజులపాటు చెల్లుబాటయ్యే తాత్కాలిక నమోదు ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. దరఖాస్తు అందిన పది రోజుల్లోపు ఇద్దరు వైద్య నిపుణులతో కూడిన బృందం సంబంధిత వైద్య సంస్థను తనిఖీ చేస్తుంది. ఆసుపత్రి భవనం, వైద్య పరికరాలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసీ, ప్రయోగశాల, రోగుల రికార్డులు, పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అత్యవసర వైద్య పరికరాలు తదితర అంశాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలన్నీ పాటించినట్లు తేలితే ఐదేళ్లపాటు చెల్లుబాటయ్యే శాశ్వత నమోదు ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తారు. ఈ ధ్రువపత్రాన్ని ఆసుపత్రి లేదా క్లినిక్ రిసెప్షన్ వద్ద రోగులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. శాశ్వత నమోదు గడువు ముగియడానికి మూడు నెలల ముందే పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలి. పునరుద్ధరణ దరఖాస్తుపై మూడు నెలల్లో అధికారులు నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిగ్గా పునరుద్ధరణ జరిగేలా ముసాయిదాలో ప్రతిపాదించారు.
తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే చర్యలు.. రద్దుపై అప్పీలుకు అవకాశం
తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే ఏడు రోజుల్లో సంబంధిత సంస్థకు సమాచారం ఇస్తారు. వాటిని సరిచేసుకునేందుకు రెండు నెలల గడువు కల్పిస్తారు. నిర్ణీత సమయంలో లోపాలను సరిచేయకపోతే నమోదు రుసుములో 50 శాతం జరిమానా విధించి మరో నెల అవకాశం ఇస్తారు. అప్పటికీ ప్రమాణాలు పాటించకపోతే తాత్కాలిక నమోదును రద్దు చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించినా, అర్హత లేని వ్యక్తులతో వైద్య సేవలు అందించినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చి అవి రుజువైనా నమోదు ధ్రువపత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా రద్దు చేసే అధికారం నమోదు అధికారికి ఉంటుంది. ఈ నిర్ణయంపై ఉత్తర్వులు అందిన 30 రోజుల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే రాష్ట్ర అప్పీలేట్ బోర్డుకు అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలు రుసుముగా రూ.5 వేలు ప్రతిపాదించారు. నకిలీ వైద్యం, అర్హత లేని వ్యక్తులు వ్యాధి నిర్ధారణ, చికిత్స పేరుతో ప్రజలను మోసం చేయడం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల నిర్వాహకులు, వైద్యులు లేదా మేనేజర్లపై చట్టప్రకారం శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.
–
చికిత్సల ధరలు, వైద్యుల వివరాల ప్రదర్శన తప్పనిసరి
రోగులకు అందించే వైద్య సేవలు, చికిత్సలకు వసూలు చేసే రుసుములను ప్రతి క్లినిక్, ఆసుపత్రిలో తెలుగు, ఆంగ్ల భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. అక్కడ పనిచేస్తున్న వైద్యుల పేర్లు, వారి రిజిస్ట్రేషన్ నంబర్లు, అందుబాటులో ఉన్న సేవలను కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలి. ప్రతి ఏడాది జూన్ 1లోపు చికిత్సల ధరల జాబితాను నమోదు అధికారికి సమర్పించాలి. చికిత్స పొందిన రోగుల వైద్య రికార్డులు, జాతీయ ఆయుష్ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భద్రపరచాలి. వైద్య సంస్థల స్థాయి, పడకల సామర్థ్యం ఆధారంగా రిజిస్ట్రేషన్ రుసుములను ప్రతిపాదించారు. సింగిల్ డాక్టర్ క్లినిక్‌కు రూ.3 వేల నుంచి 200 పడకలకు పైబడిన ఆసుపత్రికి రూ.50 వేల వరకు రుసుం ఉంటుందని పేర్కొన్నారు.
ఆసుపత్రుల స్థాయిని బట్టి చికిత్స కోసం వచ్చే రోగులకు అనుగుణంగా అత్యాధునిక పరికరాలు, ల్యాబ్స్, మరుగుదొడ్లు వంటి అన్ని రకాలు సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ప్రతి ఆయుష్ వైద్య విధానానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సలహా కమిటీలను ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్లు, తనిఖీలు, ప్రమాణాల అమలు, ఫిర్యాదులపై చర్యలను ఈ కమిటీలు సమీక్షిస్తాయి. వీటి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.
వెబ్‌సైట్‌లో ముసాయిదా
సలహాలు, సూచనలకు కోసం ముసాయిదాను ఆయుష్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ayush.ap.gov.in లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచారు. commr-apayush@ap.gov.in ద్వారా కూడా ప్రజలు, ఆయుష్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు రెండు వారాల్లో తమ విలువైన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా తెలియజేయాలని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు.
Prajavartha Online Telugu News