Breaking News

గోదావరిలో ఏస్నాన ఘట్టంలో స్నానం చేసినా పుణ్యం వస్తుందనే విశ్వాసం భక్తుల్లో కల్పించాలి

-స్నాన ఘట్టాలవారీ భక్తుల రద్దీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి
-“స్నానం-దానం-పితృతర్పణం”వంటి నినాదాలతో పుష్కరాల విశిష్టను తెలియజేయాలి
-మఠాధిపతులు,పీఠాధిపతులు,ప్రముఖ ప్రవచనకర్తల సూచనలు సలహాలు తీసుకోండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏస్నాన ఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలు 2027పై బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల విశిష్టతను ఏవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా “స్నానం -దానం-పితృతర్పణం”వంటి నినాదంతో గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర,దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుష్కర పుణ్య స్నానాలు ఆచరించే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.భక్తుల రద్దీని నిర్వహించేందుకు స్నాన ఘట్టాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు.అదేవిధంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు,ఇతర ప్రముఖ స్వామీజీలు, ప్రముఖ ప్రవచన కర్తలను స్వయంగా కలిసి వారి సూచనలు,సలహాలను తీసుకుని పుష్కరాల సమర్ధ నిర్వహణతో పాటు విజయవంతానికి తగిన ప్రణాకలను సిద్దం చేసి,ఆసూచనలను పుష్కరాల కమ్యునికేషన్ ప్లాన్ లో పొందు పర్చాలని సిఎస్ చెప్పారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్ధీ సమర్ధ నిర్వహణ,నియంత్రణకు వీలుగా ప్రతి స్నానం ఘట్టం వద్ద ప్రత్యేక అడ్వయిజరీలు ఏర్పాటు చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.నడక లేదా వాహనాలు దిగి ఆయా స్నాన ఘట్టాల వరకు ఎంత దూరం నడవాలనే దానిపై కూడా స్పష్టంగా బోర్డులను ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్దిం చేయాలని చెప్పారు.దీనిపై ప్రతి రోజు పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ద్వారా విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంతేగాక ఏ స్నానం ఘట్టంలో పుష్కర స్నానం చేసినా పుణ్యం వస్తుందని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.అంతే తప్ప కేవలం పలానా స్నాన ఘట్టంలో స్నానం ఆచరిస్తేనే పుణ్యం వస్తుందనే అపోహను ప్రజల్లో తొలగించాలని సూచించారు.భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా రైలు,రోడ్డు మార్గాల్లో లక్షల్లో తరలి వచ్చే భక్తులను ఏవిధంగా క్రమ బద్దీకరించాలనే కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి మరియు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గత పుష్కరాలకు సుమారు 4కోట్ల 80 లక్షల మంది భక్తులు రాగా వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఆసంఖ్య రెట్టింపు పైగా కానుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు.గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలవరం,ఏలూరు,తూర్పు,పశ్చిమ గోదావరి,కాకినాడ,బిఆర్ అంబేద్కర్ కోనసీమ 6 జిల్లాల్లో 3వేల 161 కోట్ల రూ.ల అంచనాలో 21 శాఖల ద్వారా 4వేల 695 వివిధ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు.ఇప్పటికే 60 కోట్ల రూ.ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఇకపై గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులు అందరితో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్,పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే,ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్,పౌర సరఫరాల శాఖ కమీషనర్ కె.కన్నబాబు,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్. విశ్వనాధన్,ఎపి మారిటైం బోర్డు సిఇఒ ప్రవీణ్ ఆదిత్య,దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్,పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా ఈసమావేశానికి వర్చ్యువల్ గా హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పోలవరం, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి,కాకినాడ,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు, ఏలూరు రేంజి ఐజిలు అశోక్ కుమార్, ఐజి రవి ప్రకాశ్,ఇంకా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *