Breaking News

కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
-రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
-రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
-పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
-బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు
-తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
-వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
-8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
-పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
-పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలుపుకొంటూ.. పల్లె నుంచి పట్టణం వరకు రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నియోజకవర్గవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటి పొడుగు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. స్థానిక శాసన సభ్యుని హోదాలో- ప్రజలు అడిగిన ప్రతి రోడ్డునీ పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు. పలు రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తే.. మరికొన్ని రోడ్లు అన్నదాత సౌలభ్యం కోసం, ఇంకొన్ని రోడ్లు మత్స్యకారులకి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉంటూ మత్స్యకారులు వేటాడిన సరుకు రవాణా చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి, అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మించారు.
• 13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంటు రోడ్లు
అలల కోతకు సముద్ర గర్భంలో కలసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించారు. ఇళ్లు అయితే కట్టించి ఇచ్చారుగానీ, మౌలిక వసతుల కల్పన మరిచారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ. 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నేడు కాలనీ మొత్తం కొత్త రోడ్లతో వెలుగులీనుతోంది. ఈ కాలనీకి సమీపంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేట. 330 మంది నివసించే ఈ కాలనీకి రూ. 93 లక్షలు వెచ్చించి 1.6 కి.మీ. సిమెంటు రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట–కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.
• తుపాను వచ్చి రోడ్డును తుడిచిపెడితే..
యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడిన ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది.
అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ, రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం, ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డు ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకునే వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది.
• గుంతలు పోయి.. అభివృద్ధి అక్కున చేరి..
సార్వత్రిక ఎన్నికలకి ముందు, తర్వాత పవన్ కళ్యాణ్ కి వచ్చిన వినతుల్లో అత్యధికంగా రోడ్ల కోసమే వచ్చాయి. గోతుల మయంగా ఉన్న రహదారుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పలు సందర్భాల్లో వినతిపత్రాలు అందజేశారు. గొల్లప్రోలు మండలం, వెన్నెపూడి గ్రామం నుచి జీఎన్టీ రోడ్డుకు వెళ్లు ప్రధాన రహదారి పూర్తిగా పాడై రెండు దశాబ్దాలు గడచింది. ఈ రోడ్డుతో సుమారు 3,800 మంది నిత్యం ప్రయాణ కష్టాలు అనుభవిస్తున్న దుస్థితి. పవన్ కళ్యాణ్ రూ. 85 లక్షల పల్లెపండగ నిధులతో ఈ రోడ్డుకు మోక్షం కల్పించారు. 1.60 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రోడ్డు వన్నెపూడి గ్రామస్తులతో పాటు పంట పొలాలకు వెళ్లే రైతులకు కూడా సౌకర్యం ఏర్పడింది. 15 ఏళ్ల క్రితం పాడైన గొల్లప్రోలు, తాటిపర్తి పుంత రోడ్డు పరిస్థితి అంతే. రూ. 1.46 కోట్లతో 2.90 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించగా, వందలాది మంది ప్రజలతో పాటు రైతులకి కూడా ప్రయాణ కష్టాలు తగ్గాయి. కొడవలి గ్రామం మధ్యన ఉన్న 370 మీటర్ల ప్రధాన రహదారిపై సిమెంటు రోడ్డు నిర్మాణం 4 వేల మందికి ఊరటనిచ్చింది.
రూ. 3 కోట్లు వెచ్చించి నిర్మించిన 1,500 మీటర్ల సీసీ రోడ్లతో చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీ వాసుల కష్టాలు తీరాయి. రోడ్లతో పాటు ఆధునిక డ్రైనేజీని నిర్మించారు. అదే చిత్రాడలో విద్యార్ధుల భద్రత కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 50 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించారు.
• పల్లెపండుగ 2.0లో డొంక రోడ్లకు ప్రాధాన్యత
విబి జీ రాం జీ నిధులతో చేపట్టిన పల్లెపండగ 2.0 కార్యక్రమంలో అన్నదాతకు ప్రత్యేక స్థానం కల్పించారు. రైతులు పండించిన సరుకును రవాణా చేసేందుకు వీలుగా పంట పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణం చేపట్టారు. పి.రాయవరం, బి. ప్రత్తిపాడు పుంత గ్రామాల్లో దాదాపు రూ. కోటికి పైగా వెచ్చించి మూడు కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్లు నిర్మించారు. తద్వారా దాదాపు 200 ఎకరాలకు పైగా పొలాల మధ్యకు రహదారి సౌకర్యం ఏర్పడింది.
• రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి : పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షలో భాగంగా కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై ఉపముఖ్యమంత్రివర్యులు అధికారులతో సమీక్షించారు. నిర్మాణం జాప్యం జరిగిన 70 కిలోమీటర్ల పెండింగ్ రోడ్లు నిర్ణీత గడువు లోపే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *