– గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బీమా పరిహారాలన్నీ చెల్లింపు
– విద్యుత్ సబ్సిడీలో భారీ పెంపు
– మత్స్యకారుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వమే ఆదర్శం… వైసీపీ నిర్లక్ష్యానికి గణాంకాలే సాక్ష్యం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి అంశంలోనూ న్యాయం చేస్తూ, మత్స్యకార కుటుంబాలకు నిజమైన భరోసా కల్పిస్తున్నామన్నారు. మాటల్లో కాదు… చేతల్లో సంక్షేమాన్ని చూపించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన మత్స్యకారుల బీమా పరిహారాలను పూర్తిగా చెల్లించడంతో పాటు, బీమా పథకాన్ని విస్తరించడం, విద్యుత్ సబ్సిడీని గణనీయంగా పెంచడం, వేట నిషేధ కాల భృతిని భారీగా పెంచి అందించడం వంటి అనేక చారిత్రక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. గణాంకాలే కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి, గత ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యక్ష సాక్ష్యాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మత్స్యకారులకు నిజమైన మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలోనే జరిగిందని, మత్స్యకారుల సంక్షేమాన్ని రాజకీయాల కోసం కాకుండా బాధ్యతగా భావించి పనిచేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా నిరాశపరిచింది. మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందాల్సిన బీమా పరిహారాలు, నష్టపరిహారాలను సైతం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన సమయంలో కూడా ఆ ప్రభుత్వం మానవత్వం చూపలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బీమా పరిహారాలన్నింటినీ చెల్లించి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాం. ఈ బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,56,66,000, కేంద్ర ప్రభుత్వం రూ.4,20,00,000 వెచ్చిస్తూ, మొత్తం రూ.6,76,66,000తో మత్స్యకార కుటుంబాలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, కేవలం సంప్రదాయ మత్స్యకారులకే కాకుండా అర్హులైన మత్స్యరంగ అనుబంధ వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులను కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చి, వారి కుటుంబాలకు భరోసా కల్పించే చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వంతో పోలిస్తే మత్స్యకారుల బీమా పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, గతంలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మత్స్యకారులకు మాత్రమే బీమా వర్తించేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వయోపరిమితిని 18 నుంచి 70 సంవత్సరాలకు పెంచి మరింత మంది మత్స్యకారులకు భరోసా కల్పించామని చెప్పారు.
గతంలో ఈ పథకం కేవలం సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం సముద్ర మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో చేపల వేట, చేపల పెంపకంపై ఆధారపడిన మత్స్యకారులకు కూడా బీమా వర్తించేలా విస్తరించామని మంత్రి వివరించారు. గతంలో సుమారు 1.30 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.5 లక్షల బీమా సౌకర్యం అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం పథకాన్ని విస్తరించి సుమారు 8 లక్షల మంది వరకు బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా, గత ప్రభుత్వంలో వేట చేస్తున్న సమయంలో మరణించినప్పుడే రూ.5 లక్షల బీమా పరిహారం లభించేదని, కానీ కూటమి ప్రభుత్వం ఆ పరిమితిని తొలగించి ఫిషింగ్ కార్యకలాపాల్లో ఉన్న సమయంలోనైనా, ఇంటి వద్ద ఉన్నప్పుడైనా, ఏ కారణంతో మరణించినా అర్హులైన మత్స్యకార కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ప్రయోజనం అందేలా చారిత్రక నిర్ణయం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గతంలో ఈ పథకం ప్రత్యక్షంగా చేపల వేటలో పాల్గొనే మత్స్యకారులకు మాత్రమే పరిమితమై ఉండేదని, ఇప్పుడు రొయ్యల పరిశ్రమలు, ఫీడ్ పరిశ్రమలు, రొయ్యలు, చేపల చెరువులు తదితర మత్స్యరంగ అనుబంధ వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఆర్థికంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, మత్స్యకారులు, మత్స్యరంగ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా రూ.6.82 కోట్లకు పైగా వెచ్చించి లక్షలాది మందికి బీమా రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్ సబ్సిడీలోనూ… వేట నిషేధ కాల భృతిలోనూ కూటమి ప్రభుత్వమే మత్స్యకారులకు అండ
మత్స్యకారుల సంక్షేమం అంటే కేవలం ప్రకటనలు చేయడం కాదు… వారి కష్టకాలంలో అండగా నిలవడం. అదే కూటమి ప్రభుత్వ విధానం. అందుకే బీమా పథకంతో పాటు విద్యుత్ సబ్సిడీ, వేట నిషేధ కాల భృతి వంటి ప్రతి అంశంలోనూ గత ప్రభుత్వంతో పోలిస్తే గణనీయంగా అధిక సహాయం అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యుత్ సబ్సిడీ విషయంలోనే రెండు ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. 2023–24లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 64,735 విద్యుత్ కనెక్షన్‌లకు కేవలం రూ.724.67 కోట్లు మాత్రమే సబ్సిడీ అందించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26లో 68,512 కనెక్షన్‌లకు రూ.845 కోట్ల సబ్సిడీ అందించామని తెలిపారు. అంతేకాకుండా 2026–27లో 71 వేల కనెక్షన్‌లకు రూ.1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. గతంలో అమలులో ఉన్న జోన్–నాన్ జోన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా మరో 12,500 కొత్త విద్యుత్ కనెక్షన్‌లకు కూడా సబ్సిడీ అందేలా అవకాశం కల్పించామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారుల ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు.
వేట నిషేధ కాల భృతిలో రెట్టింపు ఆర్థిక భరోసా
వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యతను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 2023–24లో కేవలం రూ.116.613 కోట్ల వేట నిషేధ కాల భృతిని మాత్రమే పంపిణీ చేసిందన్నారు. 2025–26లో 1,21,433 మంది మత్స్యకారులకు రూ.242.866 కోట్లు పంపిణీ చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. అంతేకాకుండా 2026–27లో మరో 12,865 మంది మత్స్యకారులను కొత్తగా చేర్చి, మొత్తం 1,34,298 మంది మత్స్యకారులకు రూ.268.596 కోట్ల వేట నిషేధ కాల భృతిని అందించి ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి … మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే ముందు మీ ప్రభుత్వ పనితీరును ఒక్కసారి గుర్తు చేసుకోండి. గణాంకాలే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెబుతున్నాయి. మత్స్యకారుల గురించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. మీ పాలనలో జరిగిన నిర్లక్ష్యం, మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసురుతున్నాను. ఎవరు మీ సంక్షేమాన్ని విస్మరించారో, ఎవరు కష్టకాలంలో మీకు అండగా నిలిచారో మత్స్యకారులకు ఈ గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News