Breaking News

పొగాకు రైతుల సంక్షేమంపై జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ సవాల్

-వాస్తవాలు, గణాంకాలతో చర్చకు సిద్ధమా జగన్? రైతుల కోసం చేసింది ఎవరు? మాటలు చెప్పింది ఎవరు? ప్రజల ముందే తేల్చుకుందాం – మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు రైతుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలపై ఆధారపడినవని, రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బహిరంగ సవాల్ విసిరారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ హోట‌ల్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి గారూ… మీరు పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడుతున్నారు, కానీ వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావడం లేదు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ సవాలును స్వీకరించండి. పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ వారిని ఆదుకున్నది టీడీపీ నాయకత్వంలోని ప్రభుత్వమే. రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారీ అండగా నిలిచి నిర్ణయాలు తీసుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదే. గత సంవత్సరం బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి, సుమారు రూ.280 కోట్లు వెచ్చించడం జరిగింది.

2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, వాణిజ్య పంట అయినప్పటికీ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతి కిలోకు రూ.20 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చరిత్రలోనే ఇది ఒక కీలక నిర్ణయం. అయితే, మీ ప్రభుత్వ హయాంలో 2019లో సుమారు 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, ధర కిలోకు రూ.121–123కు పడిపోయింది. అయినప్పటికీ మీ ప్రభుత్వం కేవలం 11.8 మిలియన్ కిలోలను మాత్రమే కొనుగోలు చేసి, మిగిలిన రైతులను గాలికి వదిలేసింది. తదుపరి సంవత్సరం సుమారు 128 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయి, ధర కిలోకు రూ.123కు పడిపోయినప్పటికీ, మీ ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు. రైతులకు ఎలాంటి అదనపు ఆర్థిక సహాయమూ అందించలేదు.

పొగాకు ధరల విషయంలో కూడా వాస్తవాలు ప్రజల ముందున్నాయి.

– 2019లో కేజీ రూ.142
– 2020లో రూ.140
– 2021లో రూ.161
– 2022లో రూ.192
– 2023లో రూ.248
– 2024లో కూటమి ప్రభుత్వ హయాంలో రూ.326
– 2025లో రూ.300
– 2026లో రూ.275

ప్రస్తుత సంవత్సరం టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు. అధిక ఉత్పత్తితో ఇబ్బందులు ఎదురైన రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం వెంటనే ముందుకొచ్చింది. సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ సహాయం పంపిణీని రేపటి నుంచే ప్రారంభిస్తున్నాం. అంతేకాదు… అంచనాకు మించి పొగాకు వచ్చినా, దానికి కూడా ప్రతి కిలోకు రూ.10 చొప్పున సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతి పొగాకు బ్యారన్‌కు రూ.50,000 వడ్డీలేని రుణం అందిస్తోంది. ఈ వాస్తవాలన్నింటి తర్వాత కూడా పొగాకు రైతుల గురించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్‌మోహన్‌రెడ్డికి లేదు. గ‌త‌ ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వ సహాయంపై గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాలు చేస్తున్నాం. రైతులు గత ప్రభుత్వ పనితీరును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పోల్చి చూడండి. ఎవరు రైతులను గాలికి వదిలేశారో, ఎవరు కష్టకాలంలో అండగా నిలిచారో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *