-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం.
-రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి పనుల్లో వేగవంతం చేయాలని సూచించిన మంత్రి
-పనులు వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లులను త్వరితగతిన చెల్లిస్తామని మంత్రి హామీ.
-రాష్ట్రంలో రూ.72,688 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
-ఆర్ & బీ శాఖ అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు అధికారిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో క్షేత్రస్థాయి అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
విజయవాడలోని ఆర్ & బీ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఈఎన్సీలు రామచంద్ర, శేషు కుమార్, చీఫ్ ఇంజినీర్లు విజయ శ్రీ, నవీన్, బుచ్చిరాజు, ఎస్‌ఈలు, ఈఈలు మరియు ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ & బీ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ “WATCH AP RISE”ను మంత్రి ప్రారంభించారు. ఆర్ & బీ శాఖ అధికారులు కష్టపడి పనిచేయడం వల్లే ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా రహదారులపై ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శాఖ అధికారులు చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న రహదారి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 45,433 కిలోమీటర్ల ఆర్ & బీ రహదారులు ఉండగా, వాటిలో 10,238 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేపట్టాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. వార్షిక నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 22,602 కిలోమీటర్ల గుంతల రహిత రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.2,500 కోట్ల వ్యయంతో చేపట్టిన 6,061 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనుల్లో ఇప్పటివరకు 53 శాతం మాత్రమే పూర్తయ్యాయని అధికారులు వివరించారు. రహదారుల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాల్లో పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. అలాగే రూ.514 కోట్లతో చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం నెలకొన్నందున ఆయా జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని ఆదేశించారు.
బిటుమన్ సరఫరాలో కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు వివరించగా, బిటుమన్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టర్లకు ధరల సవరణకు ముఖ్యమంత్రి వెసులుబాటు కల్పించారని మంత్రి తెలిపారు. ఈ సౌకర్యాన్ని రూ.40 లక్షల విలువైన పనులకు కూడా విస్తరించామని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రూ.8,530 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఇప్పటికే రూ.4,110 కోట్ల బిల్లులు చెల్లించామని మంత్రి తెలిపారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పెండింగ్ పనులను పూర్తి చేయాలని, పనులు వేగంగా పూర్తిచేస్తే బిల్లులను కూడా త్వరితగతిన చెల్లిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు.
రహదారుల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలను వచ్చే నెలలో స్వయంగా సందర్శిస్తానని, అప్పటికి గణనీయమైన పురోగతి కనిపించాలని మంత్రి స్పష్టం చేశారు.
పీపీపీ విధానంలో చేపట్టనున్న 11 ప్రాజెక్టుల్లో తొలి దశలో 6 ప్రాజెక్టులకు భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
గోదావరి పుష్కరాల దృష్ట్యా రూ.327 కోట్లతో 443 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, అలాగే బ్యారికేడ్లు, గెస్ట్ హౌస్‌ల నిర్వహణకు రూ.256 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో 8,360 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రతి లక్ష జనాభాకు 17.64 కిలోమీటర్ల రహదారి సాంద్రతతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. 2026–27లో రూ.12,500 కోట్లతో 653 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు చేపట్టగా, ఇప్పటికే 154 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో రూ.72,688 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అమలుకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఆర్‌ఐఎఫ్ (CRIF) కింద చేపట్టిన 252 పనుల్లో 208 పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎన్‌డీబీ (NDB) కింద 683 కిలోమీటర్ల రహదారి పనుల్లో 278 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నిధులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తరచూ దెబ్బతింటున్న 1,009 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.1,683 కోట్ల ప్రతిపాదనలు, అలాగే శిథిలావస్థలో ఉన్న దాదాపు 100 వంతెనల పునర్నిర్మాణానికి రూ.818 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలపై క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని మంత్రి సూచించారు. జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా ఆర్ & బీ శాఖపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News