-రెండున్నరేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి కావాలి.
-సాధించిన విజయాలను లఘు చిత్రాలతో ప్రదర్శించిన జలవనరుల శాఖ… చిత్తశుద్ధితో పనిచేశారని అభినందించిన సీఎం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నీటి లభ్యత, ఎల్-నినో ప్రభావం,ప్రాజెక్టుల నిర్వహణపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత నీటి కొరత పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో నీటి వినియోగంపై కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రతి చుక్క నీటినీ ఎంతో పొదుపుగా, పకడ్బందీగా వాడుకోవాలని, ఎక్కడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు వంటికోసం ఏప్రిల్ 6 నుంచి జూలై వరకు 100 రోజుల పాటు నిర్వహించిన ‘జలధార-జలహారతి’ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని శశిభూషణ్ కుమార్ తెలిపారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు 75 వేల పనుల ద్వారా ఉపరితలంపై 60 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూగర్భంలోకి 22.59 టీఎంసీల నీరు ఇంకేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు సగటున 23 సెంటీమీటర్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తీవ్రమైన ఎల్-నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం ఏకంగా 54 శాతానికి పైగా తగ్గడంతో భూగర్భ జల మట్టం సగటున 3 మీటర్ల మేర పడిపోయిందని వివరించారు. ముఖ్యంగా రాయలసీమలో 4.8 మీటర్లు, కోస్తాంధ్రలో 2.4 మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటాయని, అన్నమయ్య జిల్లాలో 78 శాతం వర్షపాతం లోటుతో దాదాపు 7 మీటర్లు, సత్యసాయి జిల్లాలో 10 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 638 టీఎంసీల (దాదాపు 49 శాతం) నీరు మాత్రమే నిల్వ ఉందని, గత ఏడాది ఇదే సమయానికి 1,023 టీఎంసీలు (78 శాతం) ఉండేదని అధికారులు తెలిపారు. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరిల్లో వరద ప్రవాహాలు భారీగా తగ్గాయని, శ్రీశైలంలో సాధారణం కంటే 57 శాతం, ప్రకాశం బ్యారేజీ వద్ద 46 శాతం, గోదావరిలో 51 శాతం, తుంగభద్రలో 38 శాతం మేర ప్రవాహాలు తగ్గాయని చెప్పారు. అయితే కృష్ణా డెల్టాలో ఆయకట్టు ఎండిపోకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడుతున్నామని వివరించారు.
కృష్ణా డెల్టాకు సరఫరా చేసిన దాదాపు 37 టీఎంసీల నీటిలో సుమారు 30 టీఎంసీలు పట్టిసీమ నుంచి వచ్చినవేనని, దీనివల్ల కృష్ణా ఆయకట్టులో వరి, ఉద్యాన పంటలు నిలబడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. కాలువల వెంబడి నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ఈ వివరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నీటి వినియోగంలో కచ్చితమైన ప్రాధాన్యతలు పాటించాలని స్పష్టం చేశారు. మొదటి ప్రాధాన్యతగా మనుషులతో పాటు పశువుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటికి, అత్యవసర పరిశ్రమల అవసరాలకు మాత్రమే నీటిని కేటాయించాలని ఆదేశించారు. రెండో ప్రాధాన్యతగా పశుగ్రాసం సాగుకు, మూడో ప్రాధాన్యతగా బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి శాశ్వత ఉద్యాన పంటలను కాపాడేందుకు బిందు సేద్యం ద్వారా జీవనాధార నీటిని అందించాలని సూచించారు. ఆ తర్వాతే ఆరుతడి పంటలకు వ్యవసాయ కుంటలు, సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని ఇవ్వాలని, నీటి లభ్యత ఉన్న గోదావరి డెల్టాలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కొత్తగా వరి సాగును అనుమతించవద్దని తేల్చిచెప్పారు. కలెక్టర్లు తరచూ ఇరిగేషన్ సలహా మండలి (ఐఏబీ) సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో నీటి పంపిణీని నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం ఉన్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేసిన మూడు ప్రధాన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ జలవనరుల శాఖ అధికారులు, ఇంజనీర్లను ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభినందించారు.
తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల బిగింపు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖ-అనకాపల్లికి నీటి విడుదల, మార్కాపురం వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ రిజర్వాయర్లోకి నీటిని చేర్చడం వంటి కీలక విజయాలను అభినందిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను సదస్సులో ప్రదర్శించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 33.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ఎంపిక చేసిన 36 ప్రాధాన్య ప్రాజెక్టులను రాబోయే రెండు నుంచి రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని కలెక్టర్లకు గడువు విధించారు.
భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ అండ్ ఆర్) సమస్యలను కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, సమర్థంగా పనిచేసిన అధికారులకు ఉత్తమ అవార్డులు అందజేస్తామని ప్రకటించారు.
విపత్తు సమయంలో నిరాశ చెందకుండా దృఢ సంకల్పంతో పనిచేస్తేనే ప్రజలకు ఉపశమనం కల్పించగలమని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీర్ఘకాలికంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరం సురక్షిత తాగునీరు అందించే బృహత్తర బాధ్యతను యంత్రాంగం సమర్థంగా నిర్వర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News