అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజులో ప్రభుత్వ ప్రతిష్టాత్మక “సూపర్ సిక్స్” సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, ఆర్థిక ప్రగతి, జిల్లా వారీ పనితీరు, మిగిలిన సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై సంబంధిత శాఖల కార్యదర్శులు సమగ్రంగా వివరించారు.
ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను కేవలం సంక్షేమ కార్యక్రమాలుగా కాకుండా రైతులు, మహిళలు, దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పేద కుటుంబాల ఆర్థిక–సామాజిక భద్రతను బలోపేతం చేసే సమగ్ర సంక్షేమ విధానంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. DBT, ఉచిత రవాణా, సబ్సిడీ, విద్యా ప్రోత్సాహకాలు వంటి వివిధ విధానాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అన్నదాత సుఖీభవ–PM కిసాన్…
రైతు పెట్టుబడి అవసరాలను తీర్చడం, సాగు వ్యయానికి ఆర్థిక తోడ్పాటు అందించడం, వ్యవసాయ కుటుంబాలకు నిరంతర ఆర్థిక భద్రత కల్పించడవలే ప్రధాన లక్ష్యంగా “సూపర్ సిక్స్”లో కీలకమైన అన్నదాత సుఖీభవ–PM కిసాన్ పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా.మనజీర్ జీలానీ సమూన్ తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన భూ యజమానులు, RoFR భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఏటా ₹20,000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ₹14,000, కేంద్ర ప్రభుత్వం PM-KISAN ద్వారా ₹6,000 అందిస్తున్నాయన్నారు.
2025–26లో ఈ పథకం కింద మూడు విడతలుగా దాదాపు 46.86 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం ₹8,985.41 కోట్లు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. రాష్ట్రంలో 45,69,817 మంది భూ యజమానులు, 1,16,021 మంది RoFR రైతులు కలిపి మొత్తం 46,85,838 రైతు కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారని అగ్రికల్చర్ డైరెక్టర్ డా. మనజీర్ జీలానీ సమూన్ తెలిపారు.
అదేవిధంగా 2026–27 ఖరీఫ్ విడతను 20 జూన్ 2026న విడుదల చేసి, ఒక్కో రైతు కుటుంబానికి ₹7,000 చొప్పున 46.86 లక్షల కుటుంబాలకు ₹3,125.47 కోట్లు అందించడం జరిగిందన్నారు. మొత్తంగా 2025–26 నుంచి ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ–PM కిసాన్ పథకం కింద ₹12,110.88 కోట్లు విడుదల కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹8,903.10 కోట్లు, కేంద్ర ప్రభుత్వ PM-KISAN వాటా ₹3,207.78 కోట్లుగా ఉందన్నారు.
స్ట్రీ శక్తి – మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం…
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే ఉచిత ప్రజా రవాణా కల్పించడమే లక్ష్యంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తే.15.08.2025న విజయవాడ PNBSలో ప్రారంభమైన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 9188.77 లక్షల మహిళా ప్రయాణాలు ఉచితంగా జరగగా, ప్రభుత్వం ₹3,267 కోట్ల మేర భరించిందన్నారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు, బాలికలు ప్రయాణిస్తుండగా, రోజువారీ వ్యయం సుమారు ₹8.54 కోట్లుగా ఉందని, మహిళా ప్రయాణికుల వాటా 40:60 నుంచి 62:38కి పెరిగిందన్నారు.
2025–26లో ₹1,200 కోట్లు, 2026 జూలై వరకు మరో ₹640 కోట్లు రీయింబర్స్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, NTR, పల్నాడు, YSR కడప, SPSR నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అధిక వినియోగం నమోదైందన్నారు. మహిళల విద్య, ఉపాధి, వైద్యం, స్వయం ఉపాధి తదితర అవసరాలకు చలనశీలతను పెంచుతూ మహిళా సాధికారతకు ఈ పథకం దోహదపడుతోందని ఆయన తెలిపారు.
దివ్యాంగ శక్తి పథకం…
దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 18 న ప్రారంభమైన ఈ పథకం అన్ని స్త్రీ శక్తి కేటగిరీ RTC బస్సుల్లో అమలవుతోందన్నారు. 2026–27లో ప్రభుత్వం ₹62.71 కోట్ల వార్షిక సబ్సిడీ భరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 75.31 లక్షల దివ్యాంగుల ప్రయాణాలు నమోదుకాగా, ₹29 కోట్లు సబ్సిడీగా వినియోగించబడిందని తెలిపారు. రోజుకు సగటున 0.46 లక్షల మంది దివ్యాంగులు ప్రయాణిస్తుండగా, ప్రభుత్వ సగటు రోజువారీ వ్యయం ₹17.57 లక్షలుగా ఉందన్నారు. ఇందులో 72.60 లక్షల ఉచిత ప్రయాణాలు, 2,43,209 మంది 50% రాయితీ ప్రయాణాలు, 28,073 మంది ఎస్కార్ట్ ప్రయాణాలు ఉన్నాయన్నారు.
జిల్లాల వారీగా విశాఖపట్నం, YSR కడప, అనమయ్య, NTR, అనంతపురం, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో గణనీయమైన వినియోగం నమోదైందని తెలిపారు. దివ్యాంగులకు సులభమైన, ఉచిత ప్రజా రవాణా అందించడం ద్వారా సమాన అవకాశాలు, సామాజిక సాధికారతను పెంపొందించడమే పథకం ప్రధాన లక్ష్యమని శ్రీ కోన శశిధర్ వివరించారు.
ఆటో డ్రైవర్ సేవలో….
స్వంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్లపై ఆధారపడి జీవించే డ్రైవర్ల జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కోన శశిధర్ తెలిపారు. వాహన నిర్వహణ, బీమా, ఇతర నిర్వహణ ఖర్చులకు ప్రతి లబ్ధిదారునికి ఏడాదికి ₹15,000 DBT ద్వారా అందించడం జరుగుచున్నదన్నారు.
2025–26లో 3,23,375 దరఖాస్తులు అందగా, 2,90,669 మంది అర్హులుగా గుర్తించి మొత్తం ₹436 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఇందులో 2,64,197 ఆటో రిక్షా డ్రైవర్లకు ₹396.29 కోట్లు, 20,072 మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ₹30.10 కోట్లు, 6,400 మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ₹9.60 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. జిల్లాల వారీగా విశాఖపట్నం, SPSR నెల్లూరు, NTR, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు లబ్ధిదారుల సంఖ్యలో ముందంజలో ఉన్నాయని తెలిపారు.
దీపం–2 పథకం….
అర్హులైన మహిళా లబ్ధిదారులకు వంటగ్యాస్ సబ్సిడీ అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీపం–2 పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఇప్పటివరకు ₹3,942 కోట్లు సబ్సిడీగా విడుదల చేసి, మొత్తం 1.10 కోట్ల ప్రత్యేక లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు.
2024 నవంబర్ నుంచి 2026 జూలై వరకు 5 విడతల్లో వరుసగా 97.36 లక్షలు, 94.81 లక్షలు, 92.28 లక్షలు, 93.83 లక్షలు, 90.59 లక్షల గ్యాస్ డెలివరీలు పూర్తి చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం 6వ విడత (ఆగస్టు–నవంబర్ 2026) అమలులో ఉండగా, ఇప్పటివరకు 41.83 లక్షల డెలివరీలకు ₹80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సకాలంలో సబ్సిడీ అందించడం, నిరంతరంగా గ్యాస్ సౌకర్యం కల్పించడం పథకం ప్రధాన లక్ష్యంగా అమలు చేయడం జరుగుచున్నదని కనన్నబాబు తెలిపారు.
తల్లికి వందనం….
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రవేశం, కొనసాగింపు, సమాన అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరుగుచున్నదని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. ఈ పథకం క్రింద ప్రతి విద్యార్థికి రూ.15 వేల మేర ఆర్థిక సహాయం అందజేయడం జరుగచున్నదన్నారు.
2026–27లో మొత్తం 68,05,791 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించి, వారికి మొత్తం ₹10,208.68 కోట్లు ఆర్థిక సహాయం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో ఫేజ్–1లో 64,76,590 మంది విద్యార్థులకు ₹9,714.88 కోట్లు మేర ప్రయోజనం కల్పించగా, ఫేజ్–2లో 3,29,201 మంది విద్యార్థులకు ₹493.80 కోట్లు మేర ప్రయోజనం అందించే ప్రక్రియ కొనసాగుతోందని శ్యామలరావు తెలిపారు.
Prajavartha Online Telugu News