Breaking News

అమరావతి రైతులకు ఇచ్చే కౌలు, పింఛన్లు మరో ఐదేళ్లపాటు పొడిగింపు

-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లపాటు పొడిగించేలా సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఏ సమావేశం నేడు సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబందించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో సీఆర్డీఏలో పనిచేసేందుకు 778 మంది ఉద్యోగులను నియమించడం జరిగిందని, ప్రస్తుతం వారిలో 249 మంది మాత్రమే ఉన్నారని, ఇప్పుడు మిగిలిన వారిని కూడా తీసుకునేందుకు అనుమతించడం జరిగిందన్నారు. సీఆర్డీఏలో గతంలో 47 మంది కన్సల్టెంట్లు ఉండే వారని, వారిలో 15 కన్సల్టెన్సీల పనులు పూర్తి కావడంతో మిగిలిన 32 మంది కన్సల్టెంట్లను ఇప్పుడు తీసుకోవడానికి అథార్టీ నిర్ణయించిందన్నారు. గతంలో తమ ప్రభుత్వం 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయించడం జరిగిందని, ఆ పరిధిని గత ప్రభుత్వం 6993.24 చదరపు కిలో మీటర్లకు కుదించిందన్నారు. అయితే పాత విధానం మేరకు ఆ పరిధి ఉండాలని అథార్టీలో నిర్ణయించడం జరిగిందన్నారు. సీర్డీఏ నుండి ఎక్కువ భాగం తీసేసి పల్నాడు, బాపట్ల అథారిటీలు చేయడం జరిగిందని, అయితే ఆ అథారిటీలు ఉంటాయని, వాటిలోని సీఆర్డీఏ భాగాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో కోర్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ల ఉండేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు. అయితే ఇందులో 54 చదరపు కిలోమీటర్లు గల నాలుగు గ్రామాలను మంగళగిరి మున్సిఫల్ కార్పొరేషన్ లో కలపడం జరిగిందన్నారు. ఈ 54 చదరపు కిలోమీటర్లను తిరిగి కోర్ క్యాపిటల్ సిటీలో కలుపుతూ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిగా కోర్ క్యాపిటల్ సిటీని నిర్ణయించడమైందన్నారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే ఈ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయంతీసుకున్నట్లు తెలిపారు.

గతంలో తమ ప్రభుత్వం సెంట్రల్ డివైడర్తో నాలుగు లేన్ల కరకట్ట రోడ్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తే, గత ప్రభుత్వం ఆ రోడ్డును రెండు లేన్లకు కుదించిందన్నారు. గతంలో నిర్ణయించినట్లుగానే కరకట్ట రోడ్డును నాలుగు లేన్ల నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే, అంత వరకు కరకట్ట రోడ్ నిర్మాణం ఉంటుందన్నారు. 217 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్ సిటీలో తూర్పు నుండి పడమరకి ఒక రహదారి గ్రిడ్ ను ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే ఆ రహదారి గ్రిడ్ కు అనుసందానంగా ప్రతి కిలో మీటర్ కు ఉండే రోడ్లలో ఈ-5,11,13,15 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసందానం చేయాలనే నిర్ణయాన్ని నేడు తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వస్తున్నాయని, ఇప్పటికే చేపట్టిన ఈస్ట్రన్ బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు. వీటన్నింటినీ అనుసందానం చేస్తూ కృష్ణా నదిపై ఆరు ఐకాన్ బ్రిడ్జిలు వస్తున్నాయని తెలిపారు.

రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించడం జరిగిందన్నారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 130 సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం వారి పరిస్థితి ఏమిటని తెలుసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే వారితో చర్చలు జరపడం జరిగిందన్నారు. త్వరలో తాము కూడా భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నట్లు మంత్రి తెలిపారు. బిట్స్ పిలానీ వంటి సంస్థలను కూడా రాజధాని ప్రాంతానికి తీసుకు వచ్చేలా ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలను కూడా రాజధాని ప్రాంతంలో నిర్మించేలా చూడాలని రాష్ట్ర ఎంపీలు అందరికి సంస్థల వారీగా బాధ్యలను అప్పగించడం జరిగిందన్నారు. ఆర్-5 జోన్ విషయం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో లీగల్ గా స్టడీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. అమరావతి పరిధిలో నవ నగరాలు కూడా ఉంటాయని తెలిపారు. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అమరావతిలో నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు హైద్రాబాదు, చెన్నై ఐ.ఐ.టి. నిపుణులకు అప్పగించడం జరిగిందన్నారు. నేడు హైద్రాబాదు ఐ.ఐ.టి. నిపుణులు అమరావతిలో పర్యటించి అధికారులు, ఎమ్ఎల్యేలు, ఎమ్ఎల్సీ, ఎన్జీవోలు, నాలుగో తరగతి నివాస సముదాయాల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. బహుశా శనివారం నాడు చెన్నై ఐ.ఐ.టి. నిపుణుల అమరావతిలో పర్యటించి అసెంబ్లీ, హైకోర్టు, ఐదు టవర్ల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. నిపుణుల బృందాల నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కార్య‌ద‌క్ష‌త గల ప్ర‌జానాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ లో లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -కేక్ క‌ట్ చేసిన రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా , ఎంపి కేశినేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *