-ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్షా కమిటీలు ఏర్పాటు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం వుండాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో జరిగిన సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపి కేశినేని శివనాథ్ కలిసి సురక్ష కమిటీలను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివ నాథ్,పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సురక్ష కోర్ కమిటీ సభ్యులను సత్కరించారు. ఈగల్ వెహికల్స్ ను కూడా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు
అలాగే సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర హోం మినిస్టర్ అనిత, డి.జి. పి ద్వారక తిరుమలరావు, , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్,వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ తాతాయ్య, కొలికపూడి శ్రీనివాస రావు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ,విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లతో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు బాగా అమలు చేస్తున్నారని, ఈసేవలు రాష్ట్ర వ్యాప్తంగా వుండాలని ఆకాంక్షించారు. సిపి రాజశేఖర్ బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమర్థవంతంగా పనిచేస్తూ….ప్రజల మన్ననలు అందుకున్నారని కొనియడారు. వరదల సమయంలో సిపి రాజశేఖర్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీసులు ప్రజలకు అనేక సేవలందంచారన్నారు.
గత పోలీస్ కమిషనర్ నగరంలో ఏదోక సమస్య సృష్టించేవాడు. కానీ ప్రస్తుతం వున్న కమిషనర్ రాజశేఖర్ బాబు ఏ సమస్యనైనా ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరిస్తూ, సమన్వయంతో ముందుకు సాగుతున్నాడన్నారు. ఎన్టీఆర్ జిల్లా లోని ప్రజాప్రతినిధుల సహకారం కమిషనర్ రాజశేఖర్ బాబుకి వుంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే అన్ని పోలీస్ స్టేషన్స్ డ్రోన్స్ కలిగి వుండటం ఎంతో గర్వంగా వుందన్నారు. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్ పిలుపు అందుకుని జిల్లాలోని వ్యాపారవేత్తలు 1100 సిసి కెమెరాలకు సహకారంతో అందించటం ఆనందంగా వుందన్నారు.
రాజధాని ప్రాంతంలో వున్న విజయవాడ నగరంలో పోలీసులకు పని భారం బాగా పెరిగిందని, పోలీస్ శాఖకి కావాల్సిన సిబ్బందిని, వాహనాలను అందించాలని హోంమంత్రి అనిత ను ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. అలాగే విజయవాడ వన్ టౌన్ లో పోలీస్ క్వార్టర్స్ బాగుచేయించటంతో పాటు, పాతబడిన పోలీస్ స్టేషన్స్ భవనాలను ఆధునీకరించాలని ఎంపి కేశినేని శివనాథ్ అడిగారు.