-ప్రజల ఆదాయం, సంపద పెరగాలి.
-రంగుల కలగా విజన్ 2047 డాక్యుమెంట్
-సదస్సులో వక్తలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేటు పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఆర్ధిక వ్యవస్ధలో డిమాండ్ లేనందువల్ల అభివృద్ధి జరగడం లేదని సిపిఎం 27వ మహాసభ సందర్భంగా ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి ` ప్రత్యామ్నాయ విధానాలు’ పై విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో పలువురు వ్యక్తలు స్పష్టం చేశారు. పెట్టుబడి పుష్కలంగా ఉన్నా దానికి తగిన డిమాండ్ ప్రజలనుండి లేదని, ప్రజల ఆదాయాలు పెరగకపోవడం దీనికి కారణమని చెప్పారు. ప్రభుత్వానికి జవాబుదారి తనం, స్పష్టమైన ప్రణాళికలు, నిర్ధిష్టమైన కార్యాచరణ అవసరమన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సిఎం చంద్రబాబు దావోస్‌లో ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే సంతోషమేనని, గతంలో ఎన్నో సార్లు ఈ సదస్సుల్లో చేసుకున్న ఒప్పందాలు ఫలప్రదమైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఈ రోజు ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు వేతనాలు, రైతు కూలీల ఆదాయాలు పెరగాలన్నారు. వ్యవసాయం పునాదిగా పరిశ్రమలు అభివృద్ధి కావాలన్నారు. ఇది ఎంతో కీలకమైన అంశమైనప్పటికీ ఈ అంశం విజన్ 2047లో చోటు లేదన్నారు. ప్రణాళిక రూపొందిస్తే వాస్తవికంగా ఉండాలన్నారు. ఇందులో అనుసరించిన విధానం ‘వాటర్ ఫాల్’ దీర్ఘకాలమైందని, తక్షణం రాబోయే 5సంవత్సరాలకు ప్రణాళిక రూపొందించాలని ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎజైల్ విధానం అనుసరణీయమన్నారు. 2029 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను విస్మరించి 2047 రంగుల కలలను సృష్టించడం ప్రజలను మభ్యపెట్టడమేనని తెలిపారు. వందల కోట్ల స్థాయిలో ఖర్చు చేసి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కేటాయిస్తే రాయలసీమకు నీళ్లొస్తాయని, ఈ విషయాన్ని విస్మరించి గోదావరి ` బనకచర్ల ప్రాజెక్టుకు వేల కోట్లుతో చేపడతామనడం రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీకి 150 ఎకరాలు ఇచ్చినా ఇంతవరకూ పునాది వేయలేదన్నారు. కాకినాడ సెజ్‌లో 10 వేల ఎకరాల్లో బొమ్మల పరిశ్రమ ఒక్కటితప్ప పరిశ్రమలే లేవన్నారు. 18 వేల ఎకరాల్లో ఉన్న వాన్ పిక్ సెజ్‌లో, హిందుపూర్‌లో నాలెడ్జ్ హబ్‌లో ఒక్క పరిశ్రమ లేదన్నారు. కేటాయించిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొంది ఎగనామం పెడుతున్నారని చెప్పారు. ఇదంతా స్పెక్యులేషన్‌కు తప్ప నిజమైన అభివృద్ధికి తోడ్పడదన్నారు.
ప్రజల సంపద అత్యధిక భాగం కార్పొరేట్ సంస్థలకు వివిధ రూపాల్లో చేరుతుందన్నారు. ప్రజల సంపద పెరగాలంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, సామాజిక రంగాల్లో విద్యా, వైద్యం ఉచితంగా అందించాలన్నారు. కార్పొరేట్ శక్తులకు లేబర్‌ను చౌకగా అందించేందుకు సిఎం చంద్రబాబు పిల్లలని కనాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇది బాధ్యతా రాహిత్యమైన సలహాగా పేర్కొన్నారు. కౌలుదారులకు ప్రభుత్వ భూములు 2 ఎకరాలిస్తే వారికి ఏడాదికి రూ.80 వేల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. స్పెక్యులేషన్‌కు తోర్పడే నిర్ణయాలు తప్ప వాస్తవికంగా, ప్రజలకు ప్రయోజకరమైన నిర్ణయాలను పాలకులు విస్మరిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో డేటానే ఆస్థి అన్నారు. డేటా రాజకీయాలను, ఆర్ధిక వ్యవస్థను శాసిస్తుందన్నారు. కాబట్టి ప్రభుత్వమే ఈ డేటా సెంటర్లను నిర్వహిస్తే నియంత్రణ, భద్రత ఉంటుందని చెప్పారు. 2018లో డేటా ప్రైవసి చట్టం తీసుకువస్తామన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీల అడ్డుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ వెనుకబడిన ప్రాంతాలకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. మన రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు పెట్టేవారు ఈ రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పారు. వీళ్లంతా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళికను త్వరలో జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టి చర్చించడం జరుగుతుందన్నారు. ఈ ప్రణాళికలో ప్రజలు, వివిధ వర్గాలు, సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ… ప్రస్తుతం పాలకులు ప్రజల సలహాలు, సూచనలను పూర్తిగా విస్మరిస్తున్నారని తెలిపారు. రూ. లక్ష కోట్లు కార్పొరేట్ సంస్థలకు రుణాలుగా ఇచ్చి, కట్టని బకాయిలు రూ.16వేల కోట్లు మాఫీ చేసిందని, ఇది చాలక సహకార సంఘాల్లో నిధులను తీసుకుని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. గడిచిన 35 ఏళ్ల నుంచి ఎంఎస్పి కేవలం 22 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఎంఎస్పి తక్కువగా ఉండటం వల్ల రైతులు ఏటా రూ.3 లక్షల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిపార్సుల ప్రకారం ఎంఎస్పి నిర్ణయించాలని కోరారు.
ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ…అభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక అభివృద్ధి మాత్రమే కాదని మానవా అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అని పేర్కొన్నారు. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం 130వ స్థానానికే పరిమితమవగా, దేశంలో కేరళ 1వ స్థానండగా, రాష్ట్రం 12వ స్థానం ఉందన్నారు. రాష్ట్రంలో మానవాభివృద్ధికి దోహదపడే విద్య, వైద్యం ఉండాల్సిన స్థాయిలో లేవన్నారు. 25 ప్రభుత్వ వర్సిటీలలో 6వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రాధమిక విద్యలో 50 శాతం, ఇంటర్ విద్యలో 80 శాతం కార్పొరేట్ల పరమైనట్లు చెప్పారు. ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల 4 లక్షల మంది డ్రాపవుట్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1134 పిహెచ్‌సిలు ఉంటే 400 పిహెచ్‌సిల్లో డాక్టర్ల కొరత ఉందన్నారు. పిల్లాల మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంటే ఇప్పుడు వాటిని ప్రైవేటుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య, మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికీ డోలీల్లో తరలించాల్సి వస్తుందన్నారు.
ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాయం ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మాడి రాష్ట్రంలో 1980 నుంచి 2010 వరకూ వ్యవసాయ రంగంలో తిరోగమనంలో ఉంటే, పరిశ్రామిక రంగంలో 1 శాతం మాత్రమే వృద్ధి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం మంది వ్యవసాయ రంగంపై, పారిశ్రామిక రంగంలో 10 శాతం, సేవా రంగంపై 32 శాతం ఆధారపడి ఉన్నారని తెలిపారు. సేవారంగంపై ఆధారపడి సుస్థిరాభివృద్ధి సాదించలేమన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని ఇటీవలే సిఎం చంద్రబాబు చెప్పారన్నారు. అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం అందించే సహకారం ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి వంటి గత పదేళ్లలో కేంద్రం అమలు చేయకపోవడంతోనే రాష్ట్రం వెలిటేలర్‌పై ఉండటానికి కారణమన్నారు. ఈ సదస్సులో రైతుల నాయకుల భవనీ ప్రసాద్, ప్యాస్పీ ప్రతినిధి వాసిరెడ్డి మురళీకృష్ణ, విశ్రాంత ఇంజనీర్ పున్నారావు, జర్నలిస్టులు సత్యనారాయణ, డానీ, విశ్రాంత ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.వి ఆంజనేయులు తదితరులు వారి సూచనలు, సలహాలను అందించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి.వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News