– బాధ్యతాయుత పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
– అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉండటం గర్వకారణం
– విస్తృత అవగాహన కార్యక్రమాలతో గత ఎన్నికల్లో గణనీయంగా 81 శాతం ఓటింగ్ నమోదు
– ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి ఓటు హక్కు వినియోగం ఎంతో ముఖ్యమని.. దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లోనూ నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 15 వ జాతీయ ఓటర్ల దినోత్స ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటైన రోజున ఏటా జనవరి 25 న 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల కీలక భాగస్వామ్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నథింగ్ లైక్ ఓటింగ్.. ఐ ఓట్ ఫర్ ష్యూర్.. అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్లు వివరించారు. సీఈవో మొదలు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం, ఆన్‌లైన్లో తేలిగ్గా దరఖాస్తు చేసుకునే వీలు, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. వీటి ఫలితంగా 2025, జనవరి 6 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4.14 కోట్లకు చేరుకోవటం ప్రశంసించారు. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 81 శాతం ఓటింగ్ నమోదుకు సమిష్టి కృషి కారణమన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను అడ్డుకోవడంలో పోలీస్, ఐటీ తదితర శాఖలు చేసిన కృషికి వివిధ గణాంకాలే తార్కాణమన్నారు.
ఈసీఐ పాత్ర విశిష్టమైనది:
అత్యున్నత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈసీఐ పాత్ర విశిష్టమైందని సీఎస్ విజయానంద్ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే ఓటర్ల ఉత్సాహం ఆరోగ్యకర ప్రజాస్వామ్య వ్యవస్‌షకు కీలకమని, మనం ఓటు వేయడమే కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా తోటివారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని.. ఇది ప్రత్యేక సౌకర్యమని.. ఓటు హక్కు శక్తిని చాటిచెప్పే ఉద్దేశంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన 18-19 ఏళ్ల యువత ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎస్ విజయానంద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని అన్నారు. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టే నా స్వంత గ్రామంలో ఓటు హక్కు కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. ఓటర్లలో వచ్చిన చైతన్యం ప్రజా విప్లవంగా అభివర్ణించవచ్చన్నారు. ఓటు హక్కు సాధారణ హక్కుగా చూడకూడదని, ఓటు హక్కు ఉత్కృష్టమైనదన్నారు. అలాగే రాజ్యాంగ హక్కుగా కూడా పరిగణించాలన్నారు. మన దేశంలో ఓటు హక్కు వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) ఉపయోగించడంలో మనం ముందు ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం పెరగాలని ఆకాంక్షించారు. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ఇతర ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవస్థలో చివరి గెలుపు ప్రజలదే అని ప్రజలు అంటే ఓటర్లే అని చెప్పారు. ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం వచ్చిందని, అందుకనే ఎన్నడూ లేని విధంగా ఇటీవల మన రాష్ట్రంలో 81 శాతం ఓటింగ్ వేశారని గుర్తు చేశారు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగేలా చూడాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉందన్నారు.
రాష్ట్ర జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ ఏడాది థీమ్ ఓటును మించింది ఏదీలేదు.. నేను ఓటు వేస్తాను అని వివరించారు. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అవగాహన సదస్సులు, యూత్ ఫెస్టివల్స్, వర్క్ షాపులు, డ్రాయింగ్ పోటీలతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మరీ ముఖ్యంగా యువతలో ఓటు విలువ పై అవగాహన పెంచే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు-2024 ను అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సీఈవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, జిల్లాస్థాయిలో సాంకేతిక సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు 158 మందికి అవార్డులు అందించారు.