Breaking News

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను నాశనం చేశారు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావటంలేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు భిన్న ఆలోచనలతో పాలన సాగిస్తూ.. కూటమి నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా దావోస్‌ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు చేసి ఒక చిన్న కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. దావోస్‌ పర్యటనతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తారని భావించిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలిందన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మీరు.. ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఒకేసారి దావోస్‌ వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్.. రూ.1.26 లక్షల కోట్లకు ఎంఓయులు కుదుర్చుకుని వచ్చారని గుర్తు చేశారు. అలాగే విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో రూ.13.5 లక్షల కోట్లకు ఎంఓయులు చేసుకున్నట్లు వెల్లడించారు. వాస్తవాలు ఈవిధంగా ఉంటే గవర్నర్ ప్రసంగం మాత్రం పూర్తి భిన్నంగా సాగిందని మల్లాది విష్ణు అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ మాట్లాడిన మాటలు పూర్తిగా సత్యదూరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆర్థిక క్రమశిక్షణ లేదని కాగ్ నివేదికతో తేలిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్‌ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించిందన్నారు. అప్పులు మాత్రం బడ్జెట్‌లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు స్పష్టం చేసిందన్నారు. మార్కెట్‌ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని ప్రభుత్వ పెద్దలు బడ్జెట్‌లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేయడాన్ని కాగ్‌ ఎత్తి చూపిందన్నారు. ఇందులో ఒక్క పైసా కూడా పేదల సంక్షేమానికి వినియోగించకపోవటం విడ్డూరమని మల్లాది విష్ణు అన్నారు. ఎన్నికలలో ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించటం.. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెట్టడం కూటమి నేతలకు కొత్తేమీ కాదన్నారు. గడిచిన 7 నెలల కాలంలో సంక్షేమాన్ని అందుకున్న ఒక్క లబ్దిదారుడిని అయినా చూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. చివరకు మీ చేతకానితనంతో వ్యవస్థలను సైతం భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని.. జీజీహెచ్ లో అయితే మందులు లేక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు.
ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చివరకు డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తిరిగి మాపై ఎదురు దాడి చేయటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కూటమి పాలకులు వైఖరి మార్చుకుని ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *