– హాజరుకానున్న 15 మంది ఉద్యానవన అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు
– ఆసక్తీ కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా ఉద్యానవన అధికారి సుజాత కుమారి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల పొలాలలో వెదురు సాగు విస్తీర్ణంను పోత్సహించుటకు రాష్ట్ర స్థాయీ ఒకరోజు శిక్షణా కార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలోని జి ఎస్ ఎల్ హాస్పిటల్ ఆడిటోరియంలో మార్చి 15 వ తేది శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి బి సుజాత కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జాతీయ వెదురు మిషన్ ద్వారా వెదురుసాగును పోత్సహించుటకు రాష్ట్ర స్థాయి అవగాహనా సదస్సు నిర్వహించుటకు ఉద్యాన అధికారులకు మరియు ఆసక్తిగల అభ్యుదయ రైతుల కోసం ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఉద్యానవన శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 15 మంది ఉద్యానవన శాఖ అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు, గ్రామ ఉద్యానవన సహాయకులు తదితరులు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో భాగంగా తొలుత సాంకేతిక నిపుణులు అధ్వర్యంలో సాంకేతిక శిక్షణ , అనంతరం మధ్యాహ్నం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయి లో పరిశీలనకు అటవీ శాఖ వారి అకాడమీ మరియు అటవీ పరిశోధనా స్థానములో వివిధ వెదురుసాగు రకాలను పరిశీలించుట, నర్సరీల సందర్శన ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కావున ఆసక్తి గల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సుజాత కుమారి కోరారు. ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి , రాష్ట్ర ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ డా. ఏపి. దేవమునిరెడ్డి , రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టరు విజయకుమార్ , కొన్బాక్ ( KONBAC) డైరెక్టరు సంజీవ్ కార్డే , రాష్ట్ర సేరీకల్చర్ – సేల్వి కల్చరిస్ట్ శ్రీనివాసులు, జిల్లా సుక్ష్మసేద్య నీటి సంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు ఏ . దుర్గేష్ తదితరులు పాల్గొని వారి అమూల్య సూచనలు , సలహాలు రైతులకు ఇవ్వడం జరుగుతుందని సుజాత కుమారీ పేర్కొన్నారు.