విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ విషయమై సోమవారం విజయవాడ ధర్నాచౌక్ లో గిరిజనులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతుల పోరాటం తర్వాత దేశ వ్యాప్తంగా ఆదివాసీలకు ఐటీడీఏలు వచ్చాయని.. కానీ శ్రీకాకుళం జిల్లాకు రాకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో జిల్లా విభజన సమ యంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. ఇప్పుడున్న శ్రీకాకుళం జిల్లా 8 నియోజకవర్గాలు, 16 మండలాల్లో ఆదివాసీలు సుమారు రెండు లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఐదు సబ్ ప్లాన్ మండలాల్లో ఒక్క గ్రామం కూడా 5వ షెడ్యూల్డ్ లేకపోవడం విచారకరమన్నారు. ఐటీడీఏ ఏర్పాటు చేస్తూ తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి.. ఆదివాసీ గ్రామాలను ఐదో షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరని.. గతంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారంతా ఓబీసీ కులానికి చెందినవారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో నాలుగు శాతం గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర కులాల ప్రజా ప్రతినిధులు వారి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో మాట్లాడుతుంటే.. ఆదివాసీ ఎమ్మెల్యేలు తమ గురించి మాట్లాడకపోవడం విచారకరమని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల.మాధవరావు, కె.కళ్యాణ్ కృష్ణ, కె. పొలారి ఐఎఫ్ టియు ప్రధాన కార్యదర్శి, సర్పంచులు, జమ్మయ్య, భాస్కర్ రావు, పాపారావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు గణేష్, శ్రీను, మన్మధ, సురపు నాయుడు, సోమేశ్, మోహన్, జి. పద్మ, జి. బుజ్జి,గొద్దురు. ప్రమీల, ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.
