రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్. మాధురి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్ కే వి టి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు పోక్సో , నల్సా చట్టాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్..మాధురి మాట్లాడుతూ బాల బాలికలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు భయపడకుండా వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు. ఎక్కువగా చిన్నారులపై అఘాయిత్యాలకు తమ చుట్టుపక్కల వారి నుండే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు. అటువంటి వారి పట్ల చిన్నారులు, తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలని పేర్కొన్నారు. ఎక్కువగా చదువుకునే పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బస్సులో ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణీకులు, డ్రైవర్లు, కండక్టర్లు అనుచిత ప్రవర్తన లపై బాలబాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏమైనా వారు అసభ్యకరమైన పనులు చేస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని అప్పుడే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఏమైనా సంఘటనలు జరిగితే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పిన ఎడల తమను ఎక్కడ కొడతారో, తిడతారో అనే భయపడకుండా ధైర్యంగా జరిగిన సంఘటనను వారి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆమె అన్నారు. బాల బాలికలు తమపై జరిగే అకృత్యాల పట్ల భయపడి ఊరుకుంటే సమాజంలో తప్పు చేసేవారికి తప్పు చేయటానికి మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపారు. అటువంటి సమయంలో మీరే అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉందని, చట్టాల పట్ల అవగాహన పెంచుకొని చైతన్యవంతులు కావాలని మాధురి పిలుపు ఇచ్చారు. ఎవరైనా అసభ్యకరమైన ఫోటోలు తీసి భయభ్రాంతులకు గురిచేసి బెదిరించినట్లయితే అట్టి విషయాలను కూడా తల్లిదండ్రులకు, పోలీసువారికి ఫిర్యాదు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అప్పుడే అటువంటి ఘటనలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించడానికి సాధ్యపడుతుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఎస్కేవిటీ పాఠశాల విద్యార్థి నీలు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News