మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగు చేయడం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
జీవనోపాదుల మెరుగుదలపై జిల్లా కలెక్టర్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పరిశ్రమలు, మత్స్య, పశుసంవర్ధక, సాంఘిక సంక్షేమం, ఎంపీడీవోలు తదితర అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొరమీను చేపలను తక్కువ స్థలంలోనే పెంచవచ్చని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఉదయ్ ఆక్వా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, అవసరమైన సీడ్ సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎకరం లేదా రెండు ఎకరాలు కలిగిన చిన్న రైతులు 10 సెంట్ల స్థలంలో చెరువును తవ్వుకొని సాగు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద అవసరమైన వారికి సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తుందన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆసక్తి గల 100 మంది రైతులకు డీపీఆర్ లను పరిశీలించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు చేసే లక్ష్యంలో భాగంగా, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరింప చేయదలచుకున్న వారికి అదనపు ఆర్థిక సహకారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఈజీపి, వెలుగు పథకాల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని, అర్హత గల వారిని గుర్తించి ప్రోత్సాహం అందించాలన్నారు.
జిల్లాలో అధిక పాల ఉత్పత్తికి కృషి చేయాలని అధికారులకు సూచిస్తూ, లింగ నిర్ధారిత పిండముల అభివృద్ధిపై ఆరా తీశారు. పథకం కింద లబ్ధిదారుడు కొనుగోలు చేసిన పశువులకు తప్పనిసరిగా బీమా చేయించాలన్నారు. పశువులను కొనుగోలు చేయకుండా ఇతరులు కొనుగోలు చేసిన పశువులను చూపిస్తూ పథకం రాయితీలను పొందే వారిని నిరోధించాలని సూచించారు.
సమావేశంలో డిఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులు నాగరాజ, జె జ్యోతి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి షాహిద్ బాబు, ఎంపీడీవోలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News