Breaking News

మద్యం గురించి వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం

-ఐదేళ్ల మద్యం స్కాం బయటపడుతుండడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు
-కల్తీ మద్యం బయటపడగానే అరెస్టు చేసి, పార్టీ నుండి సస్పెండ్ చేశాం
-తంబల్లపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నాం
-పేద విద్యార్ధులకు మెరుగైన వైద్య విద్య.. పేదలకు నాణ్యమైన వైద్యం మా లక్ష్యం
-మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపణలు సిగ్గుచేటు
-ఎన్ఆర్ఐ, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ప్రకటించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
-17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశావో సమాధానం చెప్పాలి
-కేంద్రం నిధులు తప్ప రాష్ట్రం నుండి పైసా ఖర్చు చేయలేదు
-కూటమి వచ్చాక మెడికల్ కాలేజీల పనులు వేగవంతమయ్యాయన్న మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యం విషయంలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలు హరించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వారి మద్యం స్కాంలోని దొంగలంతా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాం.

అన్నమయ్య జిల్లాలో మద్యం కల్తీ గురించి మొట్టమొదట బయట పెట్టిందే ఎక్సైజ్ అధికారులు. తప్పు చేసిన వారిని ఇప్పటికే అరెస్టు చేశాం. తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉందని తెలిసిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశాం. కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశాం. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటే సహించేదే లేదని ముఖ్యమంత్రిగారు ప్రకటించారు.

సరిహద్దు రాష్ట్రాల్లో నిఘా పెంచడంతో పొరుగు మద్యం దిగుమతి తగ్గి మన ఆదాయం పెరిగింది. కలుగుల్లోంచి ఎలుకల్లా వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్న వైసీపీ నాయకులు గత ఐదేళ్లు ఏం చేశారో.. ఇప్పుడేం జరుగుతోందో తెలుసుకోవాలి. తంబళ్లపల్లి ఘటన ముద్దాయికి చెందిన గోదాములో ఉన్న కల్తీ మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాం.

రాష్ట్రంలో కల్తీ మద్యానికి తావు లేదు. గతంలో కేరళ, హైదరాబాద్ గ్యాంగ్ చేస్తున్న అక్రమాలను గుర్తించి అరెస్టు చేశాం. అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటనలోనూ బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. జగన్ రెడ్డి ముఠా గత ఐదు సంవత్సరాలు చేసిన అక్రమ మద్యం దందా మొత్తం బయటపడుతోంది. అందుకే ఏమీ లేని చోట ఏదో జరిగిపోతోందంటూ హడావుడి చేస్తున్నారు.

రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం పారదర్శకంగా జరుగుతోంది. ప్రతి బాటిల్ తయారీ నుండి అమ్మకం వరకు ట్రాక్ చేస్తున్నాం. మద్యం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన దుర్మార్గం జగన్ రెడ్డిదే. నాటి దుర్మార్గాలు, పన్నుల కారణంగానే ధరల్లో వ్యత్యాసం ఉంది. బెల్టు షాపుల విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. నాటు సారా నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే రాష్ట్రాన్ని నాటు సారా రహితంగా మార్చాం.

హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినోళ్లను పక్కన పెట్టుకుంటున్నారు. గంట అరగంట అంటూ మహిళలను వేధించినోళ్లను వెంటేసుకుని తిరుగుతున్న జగన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడడం విడ్డూరం. తప్పు చేశారేమో అనే అనుమానం వస్తేనే సస్పెండ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదనే విషయం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. జగన్ రెడ్డి చేసిన ఘోరాలను ప్రజలు గుర్తించారు కాబట్టే వారికి 11 సీట్లతో గుణపాఠం చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ నేతల రాద్దాంతం సిగ్గుచేటు

మెడికల్ కాలేజీల గురించి జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఓవర్ యాక్షన్ హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జీవో నెం.107, 108, 133 ద్వారా ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ప్రకటించి, రూ.20 లక్షలు, రూ.15 లక్షల ఫీజు నిర్ణయించిందెవరో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజారోగ్యానికే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పేదలకు నాణ్యమై వైద్యం, పేద విద్యార్ధులకు ఉచితంగా మెరుగైన వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందే అన్న ఎన్టీఆర్, ఆతర్వాత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు నిర్మించాం. పేదలకు వైద్య సదుపాయాలను చేరువ చేసే లక్ష్యంతో జీనోమ్ వ్యాలీ, మెడ్ టెక్ సిటీ ఘనత చంద్రబాబు గారిదే. నిమ్స్, స్విమ్స్, బర్డ్ఆస్పత్రి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎవరు ఏర్పాటు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు.

కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నపుడే జగన్ రెడ్డికి ప్రజల ప్రాణాలంటే ఎంత చులకనో అర్ధమైంది. 17 మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డి.. వాటిలో ఎన్ని పూర్తి చేశారో సమాధానం చెప్పగలరా? ఆ కాలేజీలకు రాష్ట్రం ఇచ్చిన నిధులెంతో చూపించగలరా ?

జగన్ రెడ్డి చెబుతున్న 17 మెడికల్ కాలేజీ కోసం రూ.1450 కోట్లు ఖర్చు చేస్తే అందులో ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినవే. చివరికి పీజీ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.700కోట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడం జగన్ రెడ్డి నీచ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. మొత్తం మెడికల్ కాలేజీలు పూర్తవ్వాలంటే రూ.8450 కోట్లు అవసరం. రాష్ట్రం ప్రభుత్వం నుండి రూపాయి కూడా ఖర్చు చేయపోవడం వల్లనే ఒక్క కాలేజీ కూడా నిర్మాణానికి నోచుకోలేదు.

మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే జగన్ రెడ్డి.. బందరు మెడికల్ కాలేజీకి రావాలని సవాల్ చేశారు. మూడు నాలుగు కాలేజీల్లో అరకొర పనులు చేసి బిల్లులు కొట్టేయడం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. పాడేరు మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉంటే సదుపాయాలు లేక 50 సీట్లు మాత్రమే ఇవ్వాల్సి వచ్చింది. 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోటాగా నిర్ణయించినది ఎవరో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

కూటమ ప్రభుత్వం వచ్చాక పేదల ఆరోగ్యానికి, విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చి నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తున్నాం. పీపీపీ పద్దతిలో నిర్మాణాలు పూర్తి చేసినా.. జగన్ రెడ్డి తీసుకున్న విధానాల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి 1750కి పైగా మెడికల్ సీట్లు విద్యార్ధులకు అందిస్తామన్నారు.

గత ఐదేళ్లు ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయకుండా.. ఇప్పుడు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్ధులకు మెడికల్ సీట్లు, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని భావిస్తుంటే.. ధర్నాలు, రాస్తారోఖోలు అంటూ రాద్దాంతం చేస్తే ప్రజలు సహించరు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి ఉచిత బస్సు, మెగా డీఎస్సీ, ఉచిత సిలిండర్ పథకాలను ప్రతి లబ్దిదారునికి అందిస్తున్నాం. కూటమి పాలనకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలే మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి హడావుడి చేస్తున్నాడు.

కమిషన్ల కోసం గంగవరం పోర్టు, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలు ప్రైవేటు పరం చేసిన పాపం జగన్ రెడ్డిదే అన్నారు. మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటుంటే విమర్శలు చేయడనికి సిగ్గుపడాలన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలతో దేశ విదేశాల్లో తెలుగు వారు తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మెడికల్, ఇంజీరింగ్, ఐటీ రంగాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తులుగా మారారు.

ప్రజల్ని మభ్యబెట్టడం, మోసం చేయడం, దగా చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులను అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపాడు. జగన్ రెడ్డి లాంటి మూర్ఖుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర విన్నవించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *