-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మరియు ఇతర అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి డిసెంబర్ 3 వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ ల సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ ఎనర్జీ అసిస్టెంట్, ఆదర్శ రైతు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులు, నీటి వినియోగదారుల సంఘ సభ్యులు మరియు మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అందచేయబడుతున్న పథకాల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గౌరవ ముఖ్య మంత్రి గారి పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, Agritech (సాంకేతిక సాగు), వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రపంచ మార్కెట్ గురించి రైతులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు.
రబీ 2024 – 25 మరియు ఖరీఫ్ 2025 లో సాగు చేసిన పంటల గురించి రైతుల నుండి అభిప్రాయ సేకరణ, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులని మొగ్గు చూపేలా వివరించడం , రైతులను నూతన సాంకేతిక విధానాలు ఆచరించేలా చర్యలు తీసుకోవడం, రైతులచే APAIMS farmer యాప్ నందు నమోదు చేయించడం మరియు రైతుల వద్ద ఉన్నటు వంటి వ్యవసాయ పనిముట్ల వివరాలు మరియు మార్కెటింగ్ సౌకర్యాల గురించి వివరాలు సేకరించడం మొదలగు కార్యక్రమాలు చేపడతారని తెలిపారు.
కావున ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ అమూల్య మైనటువంటి సూచనలు, అభిప్రాయాలు తెలియ పరచవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News