-వైఎస్సార్ ఆసరా మహోత్సవాలను జయప్రదం చేయండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ రెండో విడత డబ్బులు పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర హామీ మేరకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలియజేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,439.52 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 9,165 గ్రూపుల్లోని 90,516 మందికి రూ.79.53 కోట్లు, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 3,405 గ్రూపులకు రూ. 29 కోట్ల 45 లక్షల 25వేల 458 రూపాయలు అందించనున్నుట్లు వివరించారు. తొలి విడతలో సెంట్రల్ నియోజకవర్గంలో 3,251 గ్రూపులకు గానూ రూ. 28 కోట్ల 30 లక్షల 58వేల 530 రూపాయలు డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. మహిళలను నిండా మోసగించారని గుర్తు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తూ.. డ్వాక్రా రుణాల మంజూరు, సున్నావడ్డీ, చేతి వృత్తులకు సంబంధించి రుణాలను మంజూరు చేస్తున్నారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులు పెంపొందించుకోవాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సూచించారు. మరోవైపు ఈనెల 8 నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో చేపట్టే వైఎస్సార్ ఆసరా మహోత్సవాలను విజయవంతం చేసి.. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వ్యాపార, ఉపాధి మార్గాలు, మహిళ సాధికారత పథకాలపై విస్తృత అవగాహన కల్పించవలసిందిగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బందికి సూచించారు.