-మోడీతో పొగడ్తల కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేయండి చంద్రబాబు గారూ..
-అమరావతి, పోలవరానికి మొండిచేయి
-వ్యవసాయ రంగానికి నిరాదరణ
-విభజన హామీల అమలుపై మౌనం
-అదానీ, అంబానీలకు మేలుచేసేలా బడ్జెట్
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రబడ్జెట్లో ఈ ఏడాదీ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని, కేంద్రం ఏపీకి ఏమీ వెదల్చనప్పటికీ సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లైనా లేదని, అయినప్పటికీ మరో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు మోదీతో పొగిడించుకునేందుకు సిద్ధపడేలా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి 12 బడ్జెట్లలో రాష్ట్రానికి మొండి చేయి ఎదురవుతున్నప్పటికీ.. చంద్రబాబుకు చీమకుట్ట కుట్టినట్లయినా లేకపోవడం విచారకరమన్నారు. ఏపీ నుంచి 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ..ఏం సాధించారని, వ్యాపారస్తులు చట్టసభలకు వెళ్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. మోదీ సర్కార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు అటకెక్కించిందని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నిధుల ఊసే లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి అతీగతీ లేదని, పైగా 32 మంది ప్రాణత్యాగాల ద్వారా ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా పిడికెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఏపీకి కేంద్రం ఏమి చేయకున్నప్పటికీ సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన పేరుతో ప్రధాని మోదీని ఆహ్వానించి వందల కోట్లు ఖర్చు చేశారని, ఒక విడత శంకుస్థాపనకు వచ్చిన మోదీ అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు విషయములో కనీస ప్రకటన చేయకుండా మట్టి, నీళ్లు వెళ్లిపోయారని పేర్కొన్నారు. మరోసారి అమరావతి పునర్నిర్మాణ సభలో మోదీ, చంద్రబాబులు ఒకరికి ఒకరు పొగడ్తలతో సరిపెట్టుకొన్నారు. ఈ రెండు సభలకు మోదీ ఆహ్వానించి చంద్రబాబు సాధించినది ఏమిటో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కనీసం ఈ బడ్జెట్‌లోను రాష్ట్రాభివృద్ధికి గానీ, జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి గాని, అమరావతి రాజధాని నిర్మాణానికిగాని ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని తెలిపారు. చంద్రబాబు అమరావతి పేరుతో మరోమారు మరో రూ.500 కోట్లు వెచ్చించి, నరేంద్ర మోదీని పిలిచి, తనను పొగిడించుకుంటారేమోననే సందేహం తలెత్తుతోందన్నారు. మోదీ, చంద్రబాబుల భజన పర్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, మొత్తానికి కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఏపీకి మొండి చేయి చూపిందని తెలిపారు. ఈ బడ్జెట్లో రైతులకు వెన్నుపోటు పొడిచారని, వ్యవసాయ రంగంలో 75 శాతం వరి, గోధుమ పండించే రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించలేదని వివరించారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం గిట్టుబాటు ధర లేదని, ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. రైతు ఆదాయాన్ని రెండు రెట్లు చేస్తామని 12 ఏళ్ల క్రితం చెప్పిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించామని చెబుతోందని, దీనిపై స్పష్టత లేదన్నారు. విద్య, ఆరోగ్య రంగాలను పూర్తిగా విస్మరించారని, అంబానీ ఆదానీల ఆస్తులను మరింత పెంచేందుకు ఈ బడ్జెట్ ప్రయోజనకరంగా ఉంటుందే గాని, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉండబోదని తెలిపారు. భవన నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదముందన్నారు. కేవలం ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు మాత్రం కొన్ని రాయితీలు ప్రకటించడంతో ఇది ఎన్నికల బడ్జెట్‌గా చెప్పవచ్చు అని తెలిపారు. ఆరెంజ్ ఎకానమీకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చిన్న పరిశ్రమలకు ఒరిగేదేమీ ఉండబోదని, ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేటాయించిన అప్పులే చెప్పారేగానీ, కేంద్ర నిధులు అంటూ ఏమీ లేవని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320.39 కోట్లు, అమరావతి అభివృద్ధికి ఏబీడీ బ్యాంక్ నుంచి రూ.1,128.91 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి పేరుతో రూ.432.09 కోట్ల జపాన్ నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఇవన్నీ రుణాలే, కేంద్ర నిధులు కాదని, పైగా ఇవన్నీ పాతలెక్కలేనని, కొత్త కేటాయింపులు కాదన్నారు. ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, పట్టణ తాగు, మురుగు నీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు, ఏపీ ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే ఇవన్నీ చాలా స్వల్పమని తేల్చిచెప్పారు. ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉందని, దీనివల్ల రూపాయి పతనం మరింత పెరిగే ప్రమాదముందని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, సంక్షోభాలు ఉన్నప్పుడు దేశాన్ని వాటి నుంచి బయటపడేయడానికి ఏ మాత్రం దిశానిర్దేశం ఈ బడ్జెట్ ఇవ్వలేదని, అందుకే ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్ అని స్పష్టంచేశారు. పార్లమెంటు వేదికగా పెద్దపెద్ద ప్రకటనలు చేశారని, ప్రభుత్వం విధించిన కోతలు మాత్రం చెప్పలేదన్నారు. పౌరుల వినిమయ శక్తి పడిపోయిందని ఆర్థిక సర్వే సైతం చెపుతున్నప్పటికీ బడ్జెట్ దాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సామాజిక రంగాన్ని పద్ధతి ప్రకారం విధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ భారతానికి ఊతం కలిగించే ఏ ఒక్క చర్య బడ్జెట్‌లో లేదన్నారు. గ్రామీణ ఉపాధికి చుక్కానిలా ఉండే ఉపాధి హామీ పథకాన్ని గత ఆర్థిక సంవత్సరంలో విచ్ఛిన్నం చేసిన ప్రభుత్వం వీబీ జీరామ్‌జీ పేరుతో కొత్త పథకాన్ని పెట్టి..కూలీల నోటికాడ కూటిని కొట్టేసిందని పేర్కొన్నారు. అటు పట్టణ కార్మికుల హక్కులను కాలరాసేలా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్పొరేట్లకు దాసోహమైందని, వాటిని నుంచి వెసులుబాట్లను ఈ బడ్జెట్ ఇవ్వలేకపోయిందని, కార్మిక హక్కుల రక్షణ, సామాజిక భద్రత లేకుండాపోయిందని, ఈ బడ్జెట్ వాటి నుంచి ఉపశమనం కల్పించలేదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తామని చెప్పారేగానీ, అది జరగలేదన్నారు. రైతుకు వెన్నుపోటు పొడిచారని, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని తెలిపారు. వ్యవసాయంలో చందనం, కొకోవా, కోకోనట్, ఆల్మండ్స్ సాగుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారన్నారు. వరి, గోధుమ, ఇతర వ్యవసాయ, వాణిజ్య పంటలు పండించే 75శాతం మంది రైతులకు చేసిందేమీ లేదని, వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని పేర్కొన్నారు. ఆదాయపన్ను తగ్గింపుపై ఆశించిన వేతన జీవులకు నిరాశే ఎదురైందని, పైగా కొత్త ఆదాయపన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచే అమలవుతున్నందున కనీసం ఏడాదిపాటు చట్టం అర్థం చేసుకోవడంపై గందరగోళమే తప్ప ఇంకేమీ ఉండబోదని పేర్కొన్నారు. ఆరెంజ్ ఎకానమీకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చిన్న పరిశ్రమలకు ఒరిగేదేమీ ఉండదు. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేటాయించిన అప్పులే చెప్పారేగానీ, కేంద్ర నిధులు అంటూ ఏమీ లేవని, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320.39 కోట్లు, అమరావతి అభివృద్ధికి ఏబీడీ బ్యాంక్ నుంచి రూ.1,128.91 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి పేరుతో రూ.432.09 కోట్ల జపాన్ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఇవన్నీ రుణాలేనని, కేంద్ర నిధులు కాదని, పైగా ఇవన్నీ పాతలెక్కలేనని, కొత్త కేటాయింపులు కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీలను మరోసారి విస్మరించారని తెలిపారు.
Prajavartha Online Telugu News