Breaking News

12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

-లడ్డూపై అధికార, ప్రతిపక్షాల రాద్దాంతం తగదు
-చంద్రబాబుకు అంబటి క్షమాపణ చెప్పాలి
-మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరాటాలు
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
-14న మెడికల్ మాఫియాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
-సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా ఈ నెల 12న జాతీయ కార్మిక, రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్స్ పేరుతో కార్మికుల హక్కులను హరిస్తోందని, దీని వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికులు యజమానుల దయపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

విజయవాడ దాసరిభవన్‌లో ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి హరినాథ్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో కార్మికులు, ఉద్యోగులు వారి భద్రతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పోరాటాలతో సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలుపన్నిందన్నారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చి, దాని స్థానంలో వీబీ రామ్‌జీ పేరు పెట్టిందని, దాంతోపాటు అనేక సవరణలతో కష్టజీవులకు అన్యాయం తలపెట్టిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే 90 శాతం నిధుల నిధుల వాటాను 60 శాతానికి తగ్గించి.. 40 శాతం రాష్ట్రాలే భరించాలని చెబుతూ రాష్ట్రాలపై అధిక భారం మోపుతోందని, దీని వల్ల పేదలు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని సీపీఐ నిర్ణయించిందని నొక్కిచెప్పారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏవీ లేనట్లుగా కేవలం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీలు తిరుపతి లడ్డూనే ప్రధాన అస్త్రంగా దిగజారీ వ్యాఖ్యలు చేసుకోవడం సిగ్గుచేటని రామకృష్ణ తప్పుపట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో లడ్డూ కల్తీ అంశం తప్ప ఇంకే సమస్యలేమీ లేవా?, నిరుద్యోగం లేదా?, రైతుల సమస్యలు లేదా?, ధరల పెరుగుదల లేదా?, కార్మికుల కష్టాలు లేవా?, ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలన్నింటినీ పక్కన పెట్టి లడ్డు అంశమే ఎజెండాగా వ్యాఖ్యానాలు, కథనాలు మీడియా మొత్తం చూపించడం చాలా దురదృష్టకరమని అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరూ కూడా లడ్డూ అంశం చుట్టే తిరుగుతున్నారని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాజకీయమేనని అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవమని, దాన్ని ఎవరూ సమర్థించడం లేదన్నారు. లడ్డు కల్తీపై వేగంగా దర్యాప్తు చేయాలని, దోషులను గుర్తించి కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును స్వాధీనం చేసుకోవాలని, ఇవన్నీ చేయకుండా రోజంతా ప్రెస్ మీట్లు పెట్టడం, క్యాబినెట్‌లో చర్చలు పెట్టడం, మంత్రులందరూ అదే అంశంపై మాట్లాడుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏ సందేశం ఇస్తోందని సూటిగా ప్రశ్నించారు.
ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదనీ, ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటప్పుడు శ్రీకాకుళంలోనో, శ్రీశైలంలోనో, తిరుపతిలోనో ఏదైనా ఘటన జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత అనటం సరయింది కాదు కదా అని అన్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సంబంధిత శాఖలు, ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాలేగానీ, అప్పటి ముఖ్యమంత్రిని లేదా ప్రతిపక్ష నేతను బాధ్యుడిని చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడేగానీ, ప్రతి ఆలయంలో ఏ నెయ్యి కొనుగోలు చేస్తున్నారు, ఏ బియ్యం వాడుతున్నారు, లడ్డూలో ఏ పదార్థం కలిపారు అనే విషయాలను స్వయంగా ముఖ్యమంత్రి చూడటం సాధ్యమా? అని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నట్లుగా మాట్లాడతున్నారని, ఇది పూర్తిగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు సైతం లడ్డు అంశానికి స్వస్తి పలకాలని, ఏదైనా సమస్య ఉంటే దాన్ని వార్తగా చూపాలే గానీ, అదే అంశాన్ని రోజంతా తిప్పి తిప్పి చూపించడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని, మీడియా కూడా తన పాత్రను ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయమిదని, పాలక ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం పై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

మాజీ మంత్రి, సీనియర్ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆయన ఒక సీనియర్ పార్టీ నేతగా ఉండి కూడా అలాంటి వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత తాను చంద్రబాబును అనలేదని, వేరే వారిని అన్నానని అంటూ బుకాయించడమూ తగదన్నారు. అంటే వేరే వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నేతలు కూడా భాషా సంయమనం కోల్పోతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులుగా తప్పులను ఎత్తిచూపాలేగానీ, వ్యక్తిగతంగా దిగజారే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు తక్షణమే ఉపసంహరించుకోవాలని, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలోను, రాష్ట్రంలోను ప్రజారోగ్య రంగం పూర్తిగా కార్పొరేట్ దోపిడీకి లోనవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ పంటి రాష్ట్రం నుండి ఒక లక్ష రూపాయలతో బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన మందులను మన రాష్ట్రంలో, ఇరవై లక్షలకు విక్రయిస్తున్నారన్నారు. అంటే ఎంత లాభం పొందుతున్నారో గమనించాలన్నారు. మందుల తయారీ కంపెనీల దోపిడీ, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఒకవైపు, ఫార్మా కంపెనీల దోపిడీ మరోవైపు జరుగుతుండటంతో ప్రజలు తీవ్రంగా నలిగిపోతున్నారని వివవరించారు. మందుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, నాసిరకం మందులు, అధిక ధరలు, నకిలీ బ్రాండ్లు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యక్ష దాడిగా మారాయాన్నారు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ మాఫియాపై భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశమని, చిన్న జబ్బుకు సైతం రెండు రూపాయలు, ఐదు రూపాయలతో చికిత్స చేయాల్సిన పరిస్థితి పోయి, ఈరోజు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ దేశంలో మందులు కొనేవారికి జెనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఇవ్వాలని, వైద్యులూ అవే సూచించాలని చెప్పారన్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా జెనరిక్ మెడిసిన్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం లేదని, పేరుకు అరకొర దుకాణాలు తప్ప, పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో మందుల కొనుగోలుతో ప్రజలను దోచుకునే పరిస్థితి కొనసాగుతోందని ధ్వజమెత్తారు. వైద్య రంగంలో జరుగుతున్న మాఫియాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో సిపిఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో కాకినాడలో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించబోతున్నామని వెల్లడించారు. ఈనెల 12న జరుగుతున్న సార్వత్రిక కార్మిక సమ్మెలో 500కుపైగా రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు ఈ సమ్మెలో భాగస్వాములవుతాయని వివరించారు. ఈ సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందని, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని కార్మిక, రైతు హక్కుల పరిరక్షణ కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *