Breaking News

ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది… : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌స్తుతం దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన‌డానికి, దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఏ మాత్రం అవ‌కాశం లేని బ‌డ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారేలా ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ వల్ల రూపాయి పతనం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనిశ్చితి, సంక్షోభాలు ఉన్న‌ప్పుడు దేశాన్ని వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఏ మాత్రం దిశానిర్దేశం ఈ బ‌డ్జెట్ ఇవ్వ‌లేదు. అందుకే ఇది దిశానిర్దేశం లేని బ‌డ్జెట్‌. పెద్ద పెద్ద ప్ర‌క‌ట‌న‌లు చేశారేగాని, ప్ర‌భుత్వం విధించిన కోత‌లు చెప్ప‌లేదు.
పౌరుల వినిమ‌య శ‌క్తి ప‌డిపోయింద‌ని ఆర్థిక స‌ర్వే సైతం చెపుతున్నా, బ‌డ్జెట్ దాన్ని క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. సామాజిక రంగాన్ని ప‌ద్ధ‌తి ప్ర‌కారం విధ్వంసం చేస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం గ్రామీణ భార‌తానికి ఊతం క‌లిగించే ఏ ఒక్క చ‌ర్య బ‌డ్జెట్‌లో లేదు. గ్రామీణ ఉపాధికి చుక్కానిలా ఉండే ఉపాధి హామీ ప‌థ‌కాన్ని గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో విచ్ఛిన్నం చేసిన ప్ర‌భుత్వం వీబీ జీరామ్‌జీ పేరుతో కొత్త ప‌థ‌కాన్ని పెట్టి కూలీల నోటికాడ కూటిని కొట్టేసింది. అటు ప‌ట్ట‌ణ కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాసేలా నాలుగు లేబ‌ర్ కోడ్‌లు తెచ్చి కార్పొరేట్ల‌కు దాసోహ‌మైంది. వాటిని నుంచి వెసులుబాట్ల‌ను ఈ బ‌డ్జెట్ ఇవ్వ‌లేక‌పోయింది. కార్మిక హ‌క్కుల ర‌క్ష‌ణ‌, సామాజిక భ‌ద్ర‌త లేకుండాపోయింది. ఈ బ‌డ్జెట్ వాటి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేదు. వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. రైతుకు వెన్నుపోటు పొడిచారు. వ్య‌వ‌సాయం పూర్తిగా సంక్షోభంలో ప‌డిపోయింది. కొన్ని ర‌కాల ఎరువులపై దిగుమ‌తి ఫీజులు తొల‌గించ‌డంతో అమ్మోనియా ఫాస్పేట్‌, అమ్మోనియా నైట్రో ఫాస్పేటు వంటి ఎరువుల ధ‌ర‌లు పెరుగుతాయి. ఇది పూర్తిగా రైతుల‌కు భార‌మే. వ్య‌వ‌సాయంలో చంద‌నం, కొకోవా, కోకోన‌ట్‌, ఆల్మండ్స్ సాగుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నిచ్చారు. వ‌రి, గోధుమ‌, ఇత‌ర వ్య‌వ‌సాయ‌, వాణిజ్య పంటలు పండించే 75 శాతం మంది రైతుల‌కు చేసిందేమీ లేదు. వారికి ఎలాంటి ప్రోత్సాహ‌కాలు లేవు. రైతుల‌కు సాంకేతిక తోడ్పాటు గురించి అతిగా చెప్పారు. దాని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేదు. 15 కోట్ల మంది రైతు కుటుంబాలను దగా చేసింది. విద్యా ఆరోగ్య రంగాలను పూర్తిగా విస్మరించారు. మెడికల్ టూరిజంపై దృష్టి పెట్టే బదులు ప్రభుత్వ మెరుగుదలపై దృష్టి పెడితే 130 కోట్ల మంది ప్రజలకు మంచి వైద్యం అందుతుంది. అదానీ, అంబానీలకు ఆస్తులు అప్పగించడం తప్ప చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. ఎంఎస్ఎమ్ఈ లను కూడా విస్మరిస్తున్నారు. పరిశ్రమలకు సరైన ప్రోత్సకాలు లేనందునే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆదాయ‌ప‌న్ను త‌గ్గింపుపై ఆశించిన వేత‌న జీవుల‌కు నిరాశే ఎదురైంది. పైగా కొత్త ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం ఏప్రిల్ 1 నుంచే అమ‌ల‌వుతున్నందున క‌నీసం ఏడాదిపాటు చ‌ట్టం అర్థం చేసుకోవ‌డంపై గంద‌ర‌గోళ‌మే త‌ప్ప ఇంకేమీ ఉండ‌దు.
53,47,315 కోట్ల బడ్జెట్ లో కనీసం 5 శాతం అయినా వ్యవసాయానికి కేటాయించి ఉంటే బాగుండేది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. రైతు ఆదాయాన్ని రెండు రెట్లు చేస్తామని 12 ఏళ్ల క్రితం చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు సన్న చిన్న‌కారు రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించామని చెబుతోంది. దీనిపై స్పష్టత లేదు. ఆరెంజ్ ఎకానమీకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల చిన్న పరిశ్రమలకు ఒరిగేదేమీ ఉండదు. కొత్త బడ్జెట్ భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తుంది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్లో కొన్ని రాయితీలు ప్రకటించడం గమనార్హం. ఇది ఒక విధంగా ఎన్నికల బడ్జెట్. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి నిర్మాణానికి కేటాయించిన అప్పులే చెప్పారు త‌ప్ప కేంద్ర నిధులు అంటూ ఏమీ లేవు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ.3,320.39 కోట్లు, అమ‌రావ‌తి అభివృద్ధికి ఏబీడీ బ్యాంక్ నుంచి రూ.1,128.91 కోట్లు, అమ‌రావ‌తి స‌మీకృత ప‌ట్ట‌ణాభివృద్ధి పేరుతో రూ.432.09 కోట్ల జ‌పాన్ నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇవ‌న్నీ రుణాలే, కేంద్ర నిధులు కాదు. పైగా ఇవ‌న్నీ పాత‌లెక్క‌లే. కొత్త కేటాయింపులు కాదు. ఏపీ గ్రామీణ రహ‌దారి ప్రాజెక్టుల‌కు రూ.500.99 కోట్లు, ప‌ట్ట‌ణ తాగు, మురుగు నీటి పారుద‌ల నిర్వ‌హ‌ణ‌కు రూ.800 కోట్లు, ఏపీ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి రూ.155.32 కోట్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోల్చితే ఇవ‌న్నీ చాలా స్వ‌ల్పం. రాష్ట్ర విభ‌జ‌న హామీల‌ను మ‌రోసారి విస్మ‌రించారు.

నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌సంగం చేసేట‌ప్పుడు బీజేపీ స‌భ్యులు 150సార్లు చ‌ప్ప‌ట్లు కొట్టారు, బెంచీలు చ‌రిచారు. చ‌ప్ప‌ట్లు కొట్టేటంత గొప్ప‌గా బ‌డ్జెట్ లేదు. ఎందుకు కొట్టారో అర్థం కావ‌డం లేదు. ఏఐ గురించి 11 సార్లు ప్ర‌స్తావించిన నిర్మ‌ల స‌మ‌గ్ర విధానాన్ని ప్ర‌క‌టించ‌లేక‌పోయారు. మొత్తం మీద ఈ బడ్జెట్ కార్పోరేట్లకు వరాలుగా, సామాన్యులకు శరాఘాతాలుగా ఉంటుందటంలో సందేహం లేదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *