-లోకసభ లో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని ) ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు (కె సి సి )ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంపుదల చేస్తూ 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా జారీ చేయబడిన కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య, జిల్లాల వారీగా మరియు సంవత్సరాల వారీగా గత ఐదేళ్లలో రైతులు పొందిన రుణాల వివరాలు, చెల్లింపులు, కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రుణ పరిమితిని పెంచే ప్రణాళికలు తదితర వివరాలు కోరుతూ … విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
2022 – 23 వార్షిక సంవత్సరం నుంచి వివరాలను లిఖిత పూర్వకంగా తెలిపిన మంత్రి సంబంధిత డేటాలో 2024-25 వార్షిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో మొత్తంగా 66,37,482 కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. ఆయా ఖాతాల ద్వారా రూ. 84522 కోట్ల మేర రుణాలను అందించడం జరిగిందన్నారు.
అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,73,570 కార్డులు(ఖాతాలు) ఉండగా వాటి ద్వారా రూ.10134 కోట్ల మేర రుణాల రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,94154 ఖాతాలు ఉండగా రూ.1677 కోట్ల మేర రుణాలను అందించడం జరిగిందని వివరించారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి రూ.69420.99 కోట్లు రుణాలను 2024-25 ఏడాదికి విడుదల చేయగా అదే ఏడాది ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కింద రూ.595.38 కోట్ల మేర చెల్లింపులు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎసఎల్‌బీసీ), ఆంధ్రప్రదేశ్ ప్రరభుత్వ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు (కెసీసీ) జారీ చేయబడిన సంఖ్య , రుణాలు పంపిణీ చేయబడిన మొత్తం వివరాలు , కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాల వివరాలు తెలియజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News