ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

-తాగు నీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక
-సాధారణం కంటే 39 శాతం మేర లోటు వర్షపాతం సూచనలు
-ఎల్ నినోపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి
-జలధార-జలహరతి పై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జలధార- జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగు నీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జలధార- జలహరతి కార్యక్రమంపై శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జలధార– జలహారతి కింద మొత్తంగా 82,865 పనులను గుర్తించగా..79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం రూ.3,409.35 కోట్ల పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. చెరువులు, ఫీడర్‌ ఛానళ్లు, ఫార్మ్‌ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులను చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎల్ నినో తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నాయని తద్వారా వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్‌–డిసెంబర్‌ మధ్య సాధారణ వర్షపాతం 867 మిల్లీ మీటర్ల మేర నమోదు అవుతుందని ప్రస్తుతం 525 మి.మీ. మాత్రమే నమోదు అవుుతుందన్న అంచనాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టులో 56 శాతం మేర లోటు వర్షపాతం ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. రిజర్వాయర్ల నీటి నిల్వలపైనా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ బేసిన్లల్లో ప్రస్తుతం 563.05 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని…గత ఏడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు. ఆగస్టు నుంచి భూగర్భజల మట్టాలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు ఉండటంతో తాగు నీటి నిల్వలు, సరఫరా పై పక్కాగా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగు నీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని సూచించారు. నాగార్జునసాగర్‌ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులను సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.

అందుబాటులోకి వచ్చిన నీటిని ఒడిసి పట్టండి

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని…ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకుని రిజర్వాయర్‌లను వీలైనంత మేర నింపాలని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగు నీటి వసతి పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతల మేరకు వినియోగిస్తూ పంటలకు అవసరమైన నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యత తగ్గిన పరిస్థితుల్లోనూ పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు

వర్షాభావ పరిస్థితుల కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పశువులకు అవసరమైన మేత, నీటి లభ్యతను నిర్ధారించడంతో పాటు అవసరమైన చోట్ల గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణ అనేది నిత్యం జరగాలని చెప్పారు. వివిధ కారణాల వల్ల చాలా కాలంగా నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మైక్రో బేసిన్‌ అనుసంధాన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్‌, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు అండగా నిలవాలి

-సాగునీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించాలి -జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *