-తెలంగాణలో రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకంతో కృష్ణడెల్టా ఎడారి
-102 జీవోతో పేద విద్యార్ధులకు వైద్య విద్య దూరం
-పేదల బియ్యంలో రూ.20 వేల కోట్ల అక్రమాలు
-మోదీకి భజనపరులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్
-విజయ పాలధర పెంపును ఉపసంహరించుకోవాలి
-విలేకరుల సమావేశంలో జి ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరుకు అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు.
శనివారం దాసరిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ కృష్ణానదిపై సూర్యాపేట వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం అక్రమమని, ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ వాటా నీటిని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణాడెల్టా ప్రాంతం వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాదిమందికి త్రాగునీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మౌనాన్ని వీడి వివాదస్పాదమైన ఈ ప్రాజెక్టుపై రెండు ప్రభుత్వాలు చర్చించుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు 95శాతం పనులు పూర్తి చేసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్లారని తెలిపారు. ఇదే కోవలో ఒరిస్సా ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రకు తీరని నష్టం వాటిల్లితోందని, లక్షలాది ఎకరాలు, లక్షలాదిమందికి సాగునీరు, త్రాగునీరు కూడా కరవవుతుందని తెలిపారు. ఒరిస్సాలో కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య ప్రభుత్వం ఉండటంతో చర్చించి రాష్ట్రానికి నష్టం జరగకుండా ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాని మోదీని పొగిడే కార్యక్రమం తప్పితే రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై మాట్లాడి పరిష్కరించలేని పరిస్ధితిలో కూటమి నేతలు ఉండటం బాధకరమన్నారు.
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న వైద్య సీట్ల ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 102 అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన 102 జీవో ప్రకారం, జనరల్ కేటగిరీలో సీటు పొందగలిగిన రిజర్వేషన్ అభ్యర్థి, తాను అన్ని ఆప్షన్లు పెట్టినప్పుడు అతడ్ని జనరల్ కేటగిరీ కింద కేటాయించకుండా తీసుకెళ్లి రిజర్వేషన్ కేటగిరీలో కేటాయించేలా ఉంటుందన్నారు. అంటే ర్యాంక్ చూస్తే ఓపెన్ కేటగిరిలో ఉన్నప్పటికీ, సీట్ మాత్రం రిజర్వేషన్లో ఇస్తారని పేర్కొన్నారు. దీని ఆధారంగా రిజర్వేషన్లో రావాల్సిన ఒక సీటు పోతుందన్నారు. రాబోయే వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 వల్ల తక్కువ ఆప్షన్లు పెట్టే రిజర్వేషన్ విద్యార్థులకు అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరగాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 102 జీవోను రద్దు చేసి, పాత జీవో 151ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 102 పై విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని కమిటీని ఏర్పాటుచేసి, జీవోను తక్షణమే రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే విద్యార్ధుల పక్షంగా సీపీఐ అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు.
పేదలకు ఆకలి తీర్చడానికి తీసుకువచ్చిన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం సజావుగా అమలు కావడంలేదని, భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాదాపుగా రూ.20 వేల కోట్లు అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై నిజనిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బియ్యం పంపిణీలో కేంద్రం, రాష్ట్రం వాటా ఎంతెంత, సరఫరా చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. స్ధానిక ఎమ్మేల్యేల అండదండలతో రాష్ట్రంలో రేషన్ బియ్యం పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోందని సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారని అన్నారు.
ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ భజనలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ లు మునిగితేలారేగాని, రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. నీట్ అవకతవకలపై ఆందోళన చేసిన విద్యార్ధులు న్యాయం కోసం పోరాడితే ఆ పోరాటాన్ని తప్పుదారి పట్టించే విధంగా మోదీని పొగడటం విడ్దురంగా ఉందన్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దేశంలో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని, వాటి పట్ల కనీస బాధ లేకుండా మోదీని ప్రపంచ మేధావి, విశ్వగురువు అంటూ పొగుడుతున్నారని, ఉసరవెల్లి నాటకాలను పక్కపెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. మోదీ పాలనలో అన్ని రంగాల్లో దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలపై అందరిని కలుపుకొని సీపీఐ పోరాటం చేస్తుందని ప్రకటించారు.
విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక పాల వ్యాపారానికి సంబంధించిన పెద్దల ఒత్తిడి ఉండిఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆయన రాజీనామా చేసిన వెనువెంటనే లీటరు పాల ధర రూ. 2 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలపై అదనపు భారాలు మోపితే సీపీఐ సహించబోదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News